తెలంగాణ ప్రభుత్వ చర్య దుర్మార్గం

Anil Kumar Yadav and Perni Nani Comments On Telangana Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ డెడ్‌ స్టోరేజ్‌ లెవల్‌ నీటినిల్వల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటం దుర్మార్గమైన చర్యగా మంత్రివర్గం పేర్కొందని రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అన్యాయ వైఖరిపై కేంద్ర ప్రభుత్వంతోపాటు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ)కు లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

మా చేతగానితనంగా భావించవద్దు..
‘రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటాన్ని అడ్డుకునేం దుకు ఎంతవరకైనా వెళ్తాం. తెలంగాణ మంత్రులు రాజకీయ ప్రయోజనాల కోసమే రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు. ఇరుప్రాంతాల ప్రజల ప్రయోజనం కోసం మేము సంయమనం పాటిస్తున్నాం. విడిపోయిన తరువాత కూడా రెండు ప్రాంతాల తెలుగువారు బాగుండాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం. అది మా చేతగానితనంగా భావించవద్దు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి నిల్వలను వాడుకుంటూనే ప్రాజెక్టులు కడుతున్నాం. శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీళ్లు వెళ్లాలి అంటే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్‌ కెపాసిటీ 44 వేల క్యూసెక్కులు తీసుకోవాలి. అం దుకు 885 అడుగుల సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టులో నీటి నిల్వలు 881 అడుగులకు చేరితే తప్ప ఆ మేరకు నీళ్లు తీసుకోలేం. వరదల సమయంలో 15 నుంచి 20 రోజులు మాత్రమే మనకు ఆ లెవల్‌లో అంటే 881 అడుగుల నుంచి 885 అడుగులకు నీళ్లు చేరతాయి. అతి తక్కువ సమయంలో మనం మన వాటా నీళ్లను తీసుకోవాలంటే మన కెపాసిటీని పెంచుకోవాలి. అందుకే మనకు కేటాయించిన నీటి వాటా నుంచే వాడుకుంటూ ప్రాజెక్టులు చేపడుతున్నామని సీఎం అపెక్స్‌ కౌన్సిల్‌తోపాటు పలు వేది కల మీద  స్పష్టంగా చెప్పారు. 

శ్రీశైలం డ్యాం నిండకుండా చేసేందుకే..
తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యకు పాల్ప డుతోంది. ఈ రోజు శ్రీశైలంలో 30 వేల క్యూసెక్కులు వస్తుంటే, 26 వేల క్యూసెక్కులను విద్యుత్‌ ఉత్పత్తికి వాడేస్తోంది. శ్రీశైలం డ్యాం నిండకుండా చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడుతోంది. సాగర్‌లో 20 వేల క్యూసెక్కుల నీటిని వాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. ప్రకాశం బ్యారేజీలో ఇప్పటికే పూర్తిసామర్థ్యం ఉంది. ఇప్పుడు పులిచింతలలో విద్యుత్‌ ఉత్పత్తి చేసి నీళ్లు కిందకు విడిచిపెడితే ప్రకాశం బ్యారేజీలో నిల్వ చేయలేమని తెలుసు. నీళ్లు సముద్రం లోకి వృథాగా విడిచిపెట్టడం తప్ప మరోదారి లేదు. ఇలాచేస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేయవద్దని కేఆర్‌ఎంబీ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ తెలంగాణ పట్టించుకోవడంలేదు.

జీవో జారీచేసి మరీ అన్ని జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో  పూర్తిసామర్థ్యంలో విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి తెలంగాణ చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. ఎవరికివారు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తామంటే ఇక బోర్డులు ఎందుకు? ట్రిబ్యునళ్లు ఎందుకు? ఈ పరిస్థితి ఉండకూడదనే అన్ని ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి తెచ్చి క్రమబద్ధీకరించాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.  ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కడుతుంది. నెట్టంపాడు, కల్వకర్తి ప్రాజెక్టులను విస్తరిస్తుంది. దేనికీ అనుమతి ఉండదు.  ఈ విషయంపై ప్రధానికి, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేఆర్‌ఎంబీకి లేఖ రాస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వృథాచేసిన నీటిని వాళ్లకు కేటాయించిన 299 టీఎంసీల నుంచి కుదించమని కోరుతున్నాం.

తెలంగాణ  జీవో జారీచేయడం దుర్మార్గం
‘విద్యుత్తు ఉత్పత్తి చేయకూడదని కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీచేసినప్పటికీ తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీళ్లు దిగువకు వదలడం దుర్మార్గమైన చర్య. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు..’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

‘తెలంగాణ’ గుండెల్లో వైఎస్సార్‌ 
దివంగత మహానేత వైఎస్సార్‌పై తెలంగాణ మంత్రులు అన్యాయంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌ తెలంగాణకు చీమంత అన్యాయం చేయలేదు. అందుకే ఆయన ఐదేళ్లు పరిపాలించిన తరువాత జరిగిన 2009 ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెలంగాణ నుంచే వచ్చాయి.  ఆయనపై తెలంగాణ ప్రజలకు అంత ప్రేమ ఉంది. ఆయన వారికి ఎంత మంచి చేశారన్నదానికి అదే ఉదాహరణ..’ అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top