మూడేళ్లుగా నిర్వహించని స్నాతకోత్సవం
పట్టాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న పట్టభద్రులు
పట్టనట్లు వ్యవహరిస్తున్న ఏయూ పాలకులు
వాయిదాలతో నెట్టుకొస్తున్న అధికారులు
చిన్న చిన్న యూనివర్సిటీలే ఏటా కాన్వొకేషన్ నిర్వహణ
ప్రతిష్టాత్మక ఏయూ నిర్వహించక పోవడంపై విద్యార్థుల ఆందోళన
విశాఖ సిటీ : ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిస్థితులు తీసికట్టుగా మారుతున్నాయి. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న యూనివర్సిటీ పాలన గతి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా వేల సంఖ్యలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వర్సిటీ.. పట్టాలు అందజేయడంలో మాత్రం విఫలమవుతుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత మూడేళ్లుగా ఏయూ స్నాతకోత్సవం నిర్వహించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ పట్టాలను అందుకోవడానికి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావడం శోచనీయం.
పాలకుల నిర్లక్ష్యం?
సాధారణంగా ఏటా జరగాల్సిన స్నాతకోత్సవం వరుసగా మూడేళ్ల నుంచి వాయిదా పడుతూనే ఉంది. చిన్న చిన్న విశ్వవిద్యాలయాలు సైతం ఏటా క్రమం తప్పకుండా కాన్వొకేషన్ నిర్వహించుకుంటున్నాయి. విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్నాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ మాత్రం ఈ విషయంలో వెనుకబడటం గమనార్హం. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కోవిడ్ కారణంగా మూడేళ్లు పట్టాల పండుగ జరగలేదు.
దీంతో 2023లో 87 నుంచి 90 బ్యాచ్‌ల వరకు స్నాతకోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఆ తర్వాత 2024లో ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు విద్యా సంవత్సరాలు పట్టాల ప్రదానోత్సవాన్ని నిర్వహించలేదు. గతేడాది డిసెంబర్ 30న 90, 91వ సంయుక్త స్నాతకోత్సవాలను నిర్వహిస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఆ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే అనివార్య కారణాలంటూ దానిని వాయిదా వేయడం విద్యార్థులను నిరాశకు గురిచేసింది.
పాలనా వైఫల్యం.. విద్యార్థులకు ఆర్థిక భారం
వందేళ్ల చరిత్ర కలిగిన ఏయూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ.. స్నాతకోత్సవాల నిర్వహణలో విఫలమవుతుండడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదాలు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది వర్సిటీ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ సమన్వయ లోపాన్ని బయటపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టాల పండుగను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుండడంతో విద్యార్థులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు.
విదేశాల్లో ఉంటున్న పీహెచ్‌డీ స్కాలర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పట్టభద్రులు స్నాతకోత్సవం కోసం విమాన టికెట్లు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు. చివరి నిమిషంలో వాయిదా పడటంతో టికెట్లకు వెచ్చించిన డబ్బును నష్టపోయారు. కొందరు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఈ జాప్యం తమ కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టభద్రుల ఆవేదన పట్టా చేతికి వస్తేనే తమ విద్యాభ్యాసానికి ఒక పరిపూర్ణత లభిస్తుందని విద్యార్థులు భావిస్తారు. స్నాతకోత్సవం జరగకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో పట్టా తీసుకోవాలనే విద్యార్థుల కల కలగానే మిగిలిపోతోంది. యూనివర్సిటీ పాలకులు ఇప్పటికైనా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు కోరుతున్నారు.
తక్షణమే స్నాతకోత్సవ తేదీని ప్రకటించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలనాపరమైన కారణాలు చూపు తూ కాలయాపన చేయడం వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, వేలమంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఏయూ యంత్రాంగం మొద్దునిద్ర వీడి, త్వరగా వేడుకలు నిర్వహించి పట్టభద్రుల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని పట్టుబడుతున్నారు.


