
సాక్షి, అమరావతి: డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ముందడుగు వేసింది. శుక్రవారానికి రాష్ట్రంలో కోటి హెల్త్ రికార్డులను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానం చేసి, ఈ ఘనతను సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ జీఎస్ నవీన్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో 3.4 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ రికార్డులను రాష్ట్ర ప్రజలకు అందజేశామని, ఇది కూడా మిగతా రాష్ట్రాలకంటే అధికమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు డిజిటలైజేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు.
రోగుల ఆరోగ్య నివేదికలను డిజిటలైజ్ చేసి భద్రపరచడంతో పాటు అవసరమైనప్పుడు వాటిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇందులో అర్బన్, రూరల్ హెల్త్ సెంటర్ల నుంచి బోధనాస్పత్రుల వరకు భాగస్వాములవుతాయన్నారు. ఈ కేంద్రాలన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎకో సిస్టంలో భాగంగా మారాయని ఆయన వివరించారు.