
‘అభా’తో ఆరోగ్య రికార్డులు భద్రం
నమోదు చేసుకుంటే 14 అంకెల డిజిటల్ హెల్త్ ఐడీ
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాక్సెస్‌కు వెసులుబాటు
సికింద్రాబాద్‌కు చెందిన వెంకటేశం తీవ్ర జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డాడు. బీపీ ఎక్కువై మరింత అస్వస్థతకు గురయ్యాడు.
నిజామాబాద్‌కు చెందిన భూక్యానాయక్ నగరంలో పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. తరచూ మూర్ఛ వ్యాధికి గురవుతుంటాడు. ఓ రోజు హఠాత్తుగా కిందపడి కాళ్లు, చేతులు కొట్టుకోవడంతో అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అభా నంబరు ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించడంతో కొద్దిసేపటికే కోలుకున్నాడు.
ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ‘ఆయుష్మాన్ భారత్’ అభయహస్తం అందిస్తోంది. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని అవస్థలు పడే పరిస్థితికి క్యూఆర్ కోడ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టింది. తక్షణం వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల వ్యవధిలో ఓపీ చిట్టీ మీ చేతుల్లో ఉంటుంది. కౌంటర్‌లో అభా నంబరు ఎంటర్ చేస్తే అప్పటివరకు మీకు అందించిన వైద్యసేవలు, మందులతోపాటు సమగ్ర వివరాలను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీ...
ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలను త్వరితగతిన అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా డిజిటల్ హెల్త్ ఐడీని అందించాలని 2021లో నిర్ణయించింది. దీనిని నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) అమలు చేస్తోంది. ప్రతిఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్‌ఏ–అభా) (Ayushman Bharat Health Account) ద్వారా ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తూ 14 అంకెల యూనిక్ నంబర్ కేటాయిస్తుంది.
అభా నంబర్‌ను ఇలా క్రియేట్ చేసుకోండి...
గూగుల్ ప్లేస్టోర్ నుంచి అభా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. పేరు, చిరునామా, ఆధార్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలతో సబ్‌మిట్ చేయాలి. క్రియేట్ న్యూ అభా అడ్రస్ ద్వారా సొంత ఐడీని క్రియేట్ చేసుకుని పాస్‌వర్డ్ పెట్టుకుని, అభా యాప్ ద్వారా లాగిన్ అవ్వాలి. abdm.gov.in ద్వారా కూడా అభా నంబరు పొందవచ్చు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే టోకెన్ నంబరు వస్తుంది. కౌంటర్ వద్దకు వెళ్లి టోకెన్ నంబరు చూపిస్తే అస్వస్థత, అనారోగ్య వివరాలు తెలుసుకుని సంబంధిత విభాగానికి రిఫర్ చేస్తూ ఓపీ చిట్టీ అందిస్తారు.

14 అంకెల నంబరుతో లాభాలు ఎన్నో...
క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్షణాల వ్యవధిలో సులభంగా అవుట్ పేషెంట్(ఓపీ) చిట్టీ పొందవచ్చు. వైద్యుడు అందించే వైద్యసేవలు డిజిటలైజేషన్ అవుతాయి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు పొందవచ్చు. గతంలో అందించిన వైద్యవివరాలను మరో డాక్టర్ చూసి మరింత మెరుగైన వైద్యం అందించే వెసులుబాటు కలుగుతుంది.
ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలి
ప్రతిఒక్కరు అబా యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పథకం అమలవుతోంది. గాందీఆస్పత్రిలో ఇప్పటివరకు సుమారు 3 లక్షల వరకు రోగుల వివరాలు ఆబా యాప్‌లో పొందుపర్చాం. ఈఎన్‌టీ, ఆప్తమాలజీ విభాగాల్లో జరిగే వైద్యపరీక్షల పూర్తి వివరాలు యాప్ ద్వారా పీడీఎఫ్ ఫైల్ రూపంలో రోగులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర విభాగాలకు త్వరలోనే వర్తింపజేస్తాం.
– డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, గాంధీ అభా నోడల్ ఆఫీసర్