ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పదో పరకో చదివింపులు జరుగుతూనే ఉంటాయి. దగ్గరివారైతే కొంచెం ఎక్కువ.. దూరపు చుట్టాలైతే చిన్న చిన్న గిఫ్ట్‌లతో పని కానిచ్చేస్తూంటాం. అయితే ఇప్పటివరకూ నగదు, బహుమతులతో సాగుతున్న ఈ చదివింపుల తంతు కేరళలో కొత్త అవతారమెత్తింది. పేటీఎం బాట పట్టింది.
ఎలాగంటే.. కేరళలోని ఒకానొక ఊళ్లో ఒక పెళ్లి. బంధుమిత్రుల కోలాహలం, వధూ వరుల అచ్చట్లు ముచ్చట్లు ఎన్ని ఉన్నా.. ఈ వేడుకలో హైలైట్ మాత్రం పెళ్లికూతురి తండ్రి. తెల్లటి షర్టు, పంచెతో కనిపించిన ఈయనగారి జేబుపై పేటీఎం క్యూఆర్ కోడ్ పిన్ చేసి ఉంది మరి. పెళ్లికి కాదుకానీ... మూడేళ్ల క్రితం పంజాబ్, బీహార్‌లలో శుభకార్యాల్లో బ్యాండ్ వాయించే వారికి డిజిటల్ చదివింపుల చేసిన వాళ్లు ఉన్నారు. డ్రమ్ముకు అతికించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నజరానాలు సమర్పించిన వాళ్లు కొందరైతే.. డ్రమ్ముపైనే క్యూఆర్ కోడ్ ముద్రించుకుని మరీ నగదు ప్రశంసలు పొందిన వారు ఇంకొందరు.
దేశంలో 2017లో మొదలైన ‘భారత్ క్యూఆర్’తో డిజిటల్ పేమెంట్లు చాలా సులువైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మాస్టర్‌కార్డ్, వీసాలతో మొదలుపెట్టగా.. తరువాతి కాలంలో దీన్ని అందరూ వాడటం మొదలైంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటివి మూలమూలలకూ చేరిపోయాయి. గత ఏడాది దేశం మొత్తమ్మీద 35 కోట్లకుపైగా క్యూఆర్ కోడ్‌లు చెలామణిలో ఉన్నాయంటే ఇదెంత పాప్యులర్ అన్నది ఇట్టే అర్థమై పోతుంది.
క్యూఆర్ కోడ్‌లు పెట్టుకుని భిక్షమెత్తుకునే వారిని మనం చూసే ఉంటాం కానీ ఇలా వెరైటీగా చదివింపుల కోసం క్యూఆర్ కోడ్‌ను తొలిసారి వాడింది మాత్రం ఈయనే కాబోలు!.
‘‘అయ్యలారా.. అమ్మలారా.. కూతురి పెళ్లికి బోలెడంత ఖర్చయిపోయింది... చేసే చదివింపులు ఏవో నాకూ కొంత ముట్టజెబితే... అదో తుత్తి’’ అన్నట్టుగా ఉంది ఆ తండ్రి వ్యవహారం. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగవైరల్ అయిపోయింది ఈ వీడియో క్లిప్. కొంతమంది అతిథులు మొబైల్‌ఫోన్లతో స్కాన్ చేసి పేటీఎం చదివింపులు చేయించడమూ స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో పడిందే తడవు.. పలువురు పలు రకాల కామెంట్లూ చేస్తున్నారు. పెళ్లికూతురి తండ్రికి డిజిటల్ టెక్నాలజీపై ఉన్న మక్కువను, దేశంలో డిజిటల్ చెల్లింపులు సులువైన వైనాన్ని కొంతమంది బాగానే ప్రశంసించారు. మరికొందరు డిజిటల్ టెక్నాలజీ మన సంప్రదాయాలను మరుగున పడేలా చేస్తోందని నొసలు విరిచారు కూడా. ఏదైతేనేం.. ఆ పెళ్లికి వెళ్లిన వారందరూ ఆ తండ్రి చేష్టకు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఇచ్చేదేదో ‘పే’ చేసేసి.. సుష్టుగా భోంచేసి మరీ వెళ్లిపోయారు. ఆశీర్వాదాలు వధూ వరులకు... క్యాష్ తండ్రికి అన్నమాట!


