
ఈ పథకంతో ప్రజలకు గౌరవప్రదమైన జీవితం: మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ప్రజారోగ్య రంగంలో ఈ పథకం ఒక విప్లవం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ఆయుష్మాన్ భారత్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలను చౌకగా అందించడమే లక్ష్యమని వివరించారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతోందని, ఎంతో వెసులుబాటు లభిస్తోందని అన్నారు.
దేశ పౌరులు గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఆయుష్మాన్ భారత్ తోడ్పడుతున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. నిధుల వ్యయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో మానవాభివృద్ధిలో మనం సాధిస్తున్న ప్రగతికి ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ పథకం పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 42 కోట్లకుపైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా మారిందని స్పష్టంచేశారు. ఆయుష్మాన్ భారత్ అమలుతో ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 29 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
అదేసమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు చేస్తున్న 63 శాతం నుంచి 39 శాతానికి తగ్గిపోయినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఆర్థిక భారం నుంచి లక్షలాది కుటుంబాలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. అనారోగ్యం పాలైతే ఆయుష్మాన్ భారత్ ఆదుకుంటోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం 2018 సెపె్టంబర్ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదలతోపాటు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య బీమాను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌తో ప్రతిఏటా ఆ రు కోట్లకుపైగా కుటుంబాలు పేదరికంలోకి జారిపోకుండా లబ్ధి పొందుతున్నాయని కేంద్రం వెల్లడించింది.