సామాజిక న్యాయంలో ఏపీ ఆదర్శం

Andhra Pradesh ideal in social justice says YSRCP Leaders - Sakshi

సాక్షి, అమరావతి:  రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అందించాలన్న బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇందులో భాగంగా మంత్రివర్గ కూర్పు మొదలు నామినేటెడ్‌ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. శనివారం ఆమె విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునలతో కలసి 137 నామినేటెడ్‌ పదవులకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎస్సీలకు ఒకట్రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కేవని, వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో ఐదు మంది ఎస్సీలకు స్థానం కల్పించారని చెప్పారు. సామాజిక న్యాయం ఎలా సాధించాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంత్రి చెల్లబోయిన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల వారి చేతుల్లో రాజకీయ అధికారం ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. తొలిసారిగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే అని పేర్కొన్నారు. ప్రస్తుతం నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. పేదరికాన్ని జయించాలన్న లక్ష్యంతో చేస్తున్న ఈ యజ్ఞంలో అందరం భాగస్వాములం కావాలన్నారు.

చరిత్రాత్మక నిర్ణయం
పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న వర్గాలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. దానికి పూర్తి భిన్నంగా అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఒక గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకోసం పరిపాలన పరంగా, వ్యవస్థ పరంగా, సంస్థాగతంగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు.
– మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యుడు

సమ సమాజ స్థాపనే సీఎం లక్ష్యం
సమ సమాజ స్థాపన కోసం సమాజంలో అందరూ సమాన స్థాయిలో ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. తనను నమ్మిన వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గుర్తింపునిస్తూ ప్రజా సంక్షేమ పాలనలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. సీఎం నిర్ణయాలతో దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తోంది. 
– నందిగం సురేష్, ఎంపీ

ఆచరణలోకి అంబేడ్కర్, పూలే ఆశయాలు
అణగారిన వర్గాల సామాజిక స్థితిగతులను మెరుగు పరచాలన్న బీఆర్‌ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలు ఆంధ్రప్రదేశ్‌లో విరాజిల్లుతున్నాయి. ఇన్నాళ్లూ పుస్తకాల్లో చదువుకున్న సామాజిక న్యాయం, పేద ప్రజల అభివృద్ధి అన్నవి ప్రస్తుతం రాష్ట్రంలో ఆచరణాత్మకంగా చూస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు మార్చి, వారికి రాజకీయంగా సామాజికంగా గౌరవం కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంగారు బాట పరుస్తున్నారు.
– మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ అందించడమే లక్ష్యం
ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతతో సుపరిపాలన సాగిస్తున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి ద్వారా సామాజిక న్యాయం, మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేశారు. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు కలిపి రాబోయే మూడేళ్లలోనే 15 ఏళ్ల అభివృద్ధిని సాధించడం ముఖ్యమంత్రి లక్ష్యం. ఎన్నికల ముందు బీసీ డిక్లేరేషన్‌లో, పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నామినేటెడ్‌ పోస్టులకు చైర్‌పర్సన్లను ఆయనే స్వయంగా ఎంపిక చేశారు. కొన్ని పదవులకు సంబంధించి ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ కోసం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించిన 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఎంపికయ్యారు. గతంలో మాదిరిగా నామినేటెడ్‌ పదవులు కేవలం అలంకార ప్రాయం కాదు. రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తలపెట్టిన మహాయజ్ఞంలో కీలకంగా ఉండే బాధ్యతాయుతమైన పదవులు. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. 
– సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top