498ఏ కింద గర్ల్‌ఫ్రెండ్‌ను విచారించేందుకు వీల్లేదు..

Andhra Pradesh High Court About IPC Section 498A - Sakshi

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం 

సాక్షి, అమరావతి: గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్‌ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్‌ కింద విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. భర్త సంబంధీకుల్లోకి గర్ల్‌ఫ్రెండ్‌ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదంది. ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌పై పోలీసులు సెక్షన్‌ 498ఏ కింద నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అరెస్ట్‌తో సహా ఎలాంటి ఇతర కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. తనను వేధిస్తున్నారంటూ కొమ్మి సునీత.. భర్త ధర్మయ్య, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, భర్తకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న ఓ యువతిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిశా మహిళా పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి, రెండో నిందితురాలిగా చేర్చారు. దిశా పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ ఆ యువతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ విచారణ జరిపారు.

వివాదంలోకి పిటిషనర్‌ను అనవసరంగా లాగారు..
పిటిషనర్‌(యువతి) తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగప్రవీణ్‌ వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు సునీత, ఆమె భర్త ధర్మయ్యకు మధ్య ఉన్న గొడవల్లో పైచేయి సాధించేందుకు వారి మధ్య వివాదంలోకి పిటిషనర్‌ను లాగారని తెలిపారు. ఫిర్యాదుదారు చెబుతున్న వేధింపులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెక్షన్‌ 498ఏ ప్రకారం భర్త, ఆయన బంధువులపై మాత్రమే వేధింపుల కేసు పెట్టేందుకు అవకాశం ఉంటుందని, అయితే పిటిషనర్‌ ఏ రకంగానూ ఫిర్యాదుదారు భర్తకు బంధువు కాదని తెలిపారు. అందువల్ల పిటిషనర్‌పై పోలీసులు పెట్టిన కేసు చెల్లదని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకునేంత బలంగా పిటిషనర్‌ వాదనలున్నాయన్నారు. 498ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top