ఆరు నెలలు.. 4 వేల గ్రామాలు | Andhra Pradesh Govt preparing to issue land documents after re-survey | Sakshi
Sakshi News home page

ఆరు నెలలు.. 4 వేల గ్రామాలు

Dec 5 2022 6:35 AM | Updated on Dec 5 2022 3:42 PM

Andhra Pradesh Govt preparing to issue land documents after re-survey - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మే నెలాఖరు నాటికి మరో 4 వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్, సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్, ఇతర అధికారులతో ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి లక్ష్యాలను నిర్దేశించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్దేశించిన విధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి 2 వేల గ్రామాలు, మే నాటికి మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ఇటీవలే 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 8 లక్షల మంది భూయజమానులకు హక్కు పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో వచ్చే 6 నెలల్లో 4 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు అధికారులు చర్యటు చేపట్టారు. 

తక్షణ పరిష్కారమే లక్ష్యంగా
రీ సర్వే చేసే క్రమంలో జారీ చేసే నోటీసుల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో బైపాస్‌ చేయకూడదని కలెక్టర్లకు సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియలో గ్రామ కార్యదర్శి, వీఆర్‌వో సహా గ్రామ సచివాలయ బృందం మొత్తం భాగస్వామ్యం కావాలని సూచించారు. సరైన సమాచారం లేని కారణంగా భూ హక్కు పత్రాలు జారీ కాని కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

పట్టాదారు మృతి చెందడం, ఖాతా నంబర్, పాత సర్వే నంబర్‌ తప్పుకావడం, విస్తీర్ణం సరిపోకపోవడం వంటి కారణాలతో ఆగిపోయిన పత్రాల జారీ కోసం వెంటనే చర్యలు తీసుకుని పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన భూ హక్కు పత్రాల్లో దొర్లిన తప్పుల్ని సరిచేసే వెబ్‌ల్యాండ్‌–2 వ్యవస్థ ఈ నెల రెండో వారానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

తుది ఆర్‌ఓఆర్‌లో కూడా తప్పుల్ని సరి చేసుకునేందుకు ఉన్న అవకాశాల గురించి ప్రజలకు తెలిసేలా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతినెలా రీ సర్వేపై తహసీల్దార్లు, మొబైల్‌ మెజిస్ట్రేట్లు, ఇతర రెవెన్యూ అధికారులకు కలెక్టర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమైన అంశాలను వివరించాలని ఆదేశించారు. వచ్చే 2, 3 నెలల్లో రాష్ట్రంలోని 17,460 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేయాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement