ఈసారైనా కేంద్రం కరుణించేనా!.. గంపెడు ఆశలతో ఎదురుచూపు

Andhra Pradesh Govt Hopes On Union Budget - Sakshi

సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన గాయాలతోపాటు కోవిడ్‌ మహమ్మారి విసిరిన సంక్షోభంతో రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అయినా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కరుణ చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. కోవిడ్‌తో రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయింది. మరోవైపు ఉమ్మడి ఏపీ విభజన జరిగిన నాటి నుంచి రాష్ట్రం రెవెన్యూ లోటులోనే ఉంటోంది.

ఈ నేపథ్యంలోనైనా బుధవారం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తగు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు జాతీయ గ్రాంట్ల రూపంలో ఈసారైనా బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక ఏడాదిలో ఏర్పడ్డ రెవెన్యూ లోటు భర్తీకి ఈసారి బడ్జెట్‌లోనైనా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు కేటాయించాలని కోరుతోంది.

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా విభజన జరిగిన ఆర్థిక ఏడాదిలో ఏర్పడిన రెవెన్యూ లోటును ఇంకా పూర్తి స్థాయిలో భర్తీచేయకపోవడం సరికాదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా రెవెన్యూ లో­టు భర్తీకి నిధుల మంజూరు చేయాలని కోరారని చె­బు­తున్నాయి. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్‌లోనైనా ఫలితం ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించాయి. 

ప్రత్యేక అభివృద్ధి సాయంపై ఆశలు..
ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్‌లో రూ.24,350 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. అలాగే విశాఖకు మెట్రో రైలు మంజూరు చేయడంతోపాటు తగినన్ని నిధులు ఇవ్వాలని విన్నవించింది. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా సమర్పించింది.

ఈ నేపథ్యంలో ఈ బడ్టెట్‌లో మెట్రో రైలు ప్రకటనతో పాటు కేంద్రం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసినందున జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మిగిలిన 12 జిల్లాలకు వైద్య కళాశాలలకు నిధులు కేటాయించాలని కోరుతోంది. అలాగే రాజధాని వికేంద్రీకరణతో ఆ కార్యకలాపాలకు కూడా నిధులను ఆశిస్తోంది.

ఇక పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్‌ నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరుతోంది. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఆదాయపన్ను మినహాయింపు, 100 శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రీయింబర్స్‌మెంట్‌లను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top