RT PCR Test Price: ఆర్టీపీసీఆర్‌ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Government Finalized RTPCR Test rate - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌ రేటును సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో రూ.499 వసూలుచేస్తున్నారు.  

6,996 కరోనా కేసులు 
గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) రాష్ట్ర వ్యాప్తంగా 38,055 నమూనాలను పరీక్షించగా 6,996 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురంలో 462, ప్రకాశంలో 424, విజయనగరంలో 412 కేసులు వచ్చాయి.

వైరస్‌ బారిన పడి విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఒక్క రోజులో 1,066 మంది కోవిడ్‌ నుంచి కోలుకోవడం విశేషం. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,17,384 చేరింది. ఇందులో 20,66,762 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. 14,514 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 36,108 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం 3,19,22,969 శాంపిళ్లను పరీక్షించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top