నూతన విద్యావిధానం అమలులో ఏపీ భేష్‌

Andhra Pradesh Good in implementation of the new education system - Sakshi

ఇతర రాష్ట్రాలూ ఏపీని అనుసరించాలి

కొందరు కుల, మత, వర్గ విభేదాలతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు

ఇది దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

గుంటూరు ఎడ్యుకేషన్‌/గుంటూరు మెడికల్‌/మంగళగిరి: కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని ఏపీ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభినందించారు. ఏపీ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రాష్ట్రమూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మంగళవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులో రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన గురు సన్మానం, 2020–2021 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామినేని ఫౌండేషన్‌ మాతృభూమికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

కరోనా సమయంలోనూ విద్యా వ్యవస్థను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు శ్రమించిన తీరు అభినందనీయమన్నారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగారాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసి, ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రముఖ రచయిత వేదాంతం శరశ్చంద్రబాబు రచించిన నీతి కథల సమాహారం ‘కథాసూక్తమ్‌’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. 

ప్రజల కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతారు..
సమాజ హితాన్ని కోరి.. ప్రజల కోసం జీవిస్తే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో కొందరు కుల, మత, వర్గ విభేదాలతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, ఇది దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థి, నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు మాట్లాడుతూ పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్యనందించి.. తన జీవితాన్ని తీర్చిదిద్దిందని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, డాక్టర్‌ యలమంచిలి శివాజీ పాల్గొన్నారు. 

రంగరాజు ఇంటికి ఉప రాష్ట్రపతి.. 
గుంటూరు రైలుపేటలోని బీజేపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ జూపూడి రంగరాజు గృహాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం సందర్శించి.. వారి కుటుంబంతో అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో రంగరాజు తండ్రి జూపూడి యజ్ఞనారాయణ ఒకరు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top