గుడ్‌న్యూస్‌: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’

Andhra Pradesh to Give e-bikes to Govt Employees on EMI - Sakshi

వాయిదా పద్ధతిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ సిబ్బందికి సర్కారు అవకాశం

60 వాయిదాల్లో ధరను చెల్లించేలా ప్లాన్‌

ఒక్కో వాహనంపై కిలోవాట్‌కు రూ.10 వేల వరకూ రాయితీ

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల చార్జింగ్‌ స్టేషన్లు

సాక్షి, అమరావతి: వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్‌ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్‌ పేమెంట్‌ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది.

ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రాయితీలు కూడా వస్తాయని అందులో పేర్కొంది. ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. వారు కోరితే ఈ–వాహనాల కొనుగోలుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది.

అందరికీ అవకాశం..
వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి 24–60 నెలల్లో వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లుచేయనున్నారు. కనీసం నెలకు రూ.2,500 చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద ప్రభుత్వోద్యోగులకు రుణాలు అందించేందుకు ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో నెడ్‌కాప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వడ్డీరేటు 9 శాతం. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, వారు ఆ సంస్థ సీఈఓగానీ లేదా మేనేజర్‌గానీ అధీకృత లెటర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆసక్తిగల ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ సూచించింది. 

అందుబాటులోకి చార్జింగ్‌ స్టేషన్లు
ఈవీల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉండగా జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి చోట్ల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల ప్రాంతాలను గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్‌ అయ్యే స్టేషన్లని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 300 ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలను నెలకొల్పాలని నెడ్‌కాప్‌ సంకల్పించింది. నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కి.మీ.కు ఒకటి ఏర్పాటుచేయనుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top