భూగర్భ జలాల పరిరక్షణలో ఏపీ అగ్రగామి

Andhra Pradesh Gets Top Place In Ground Water Conservation - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచింది. నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్‌హెచ్‌పీ) అమలు­లో దేశంలో రాష్ట్రానిది తొలిస్థానం. భూగర్భ జలవనరుల పరిరక్షణ కోసం దేశంలో మూడేళ్ల నుంచి ఎన్‌హెచ్‌పీని కేంద్రం అమలుచేస్తోంది. దేశవ్యాప్తంగా జలసంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా  రాష్ట్రవ్యాప్తంగా 13.09 లక్షల జల సంరక్షణ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టంది. వాటి ద్వారా వర్షపు నీరు అధిక శాతం భూమిలోకి ఇంకి.. భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదం చేసింది.

డ్రిప్, స్ప్రింక్లర్లతో తగ్గిన నీటి వినియోగం
రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరు, బావుల కింద 40 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఈ బోరు బావులను ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ చేసింది. ఈ బోరు బావుల కింద సుమారు 13 లక్షల మంది రైతులకు 34.58 లక్షల ఎకరాలలో సూక్ష్మనీటిపారుదల విధానంలో పంటల సాగుకు డ్రిప్, స్ప్రింక్లర్లను ప్రభుత్వం అందజేసింది. ఇది భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేలా చేసింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1,254 ఫిజియో మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాన్ని పర్యవేక్షిస్తూ భూగర్భ జలాలను పరిరక్షించింది.

పుష్కలంగా భూగర్భ జలం
ఇక గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షా­లు కురుస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యలతో భూగర్భ జలమట్టం పెరిగింది. 2017తో పోలిస్తే 2020 నుంచి రాష్ట్రంలో ఏటా భూగర్భ జలాల లభ్యత 208 టీఎంసీలు పెరిగిందని కేంద్రం తేల్చింది. అలాగే, భూగర్భజలాల వినియోగం ఏటా సగటున 48 టీఎంసీలు తగ్గిందని పేర్కొంది. దీంతో.. భూగర్భ జలాల లభ్యత ఏటా పెరగడం.. వినియోగం తగ్గడంతో దేశంలో భూగర్భ జలాల సంరక్షణలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.65 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండటం గమనార్హం. ఇలా భూగర్భ జలాల లభ్యత పెరగడంతో అటు సాగునీటికి.. ఇటు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పోయాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top