‘సులభతర వాణిజ్యం’ అమలులో రెండో స్థానంలో ఏపీ
సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
ఈవోడీబీ–2022 ర్యాంకుల కోసం 25 రంగాల్లో సంస్కరణల ప్రతిపాదన
17 రాష్ట్రాలు ఈ సంస్కరణలు అమలు చేసి ర్యాంకుల కోసం పోటీ
కేరళ తర్వాత స్థానం ఏపీదే
కూటమి అబద్ధపు ప్రచారానికి చెంపపెట్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మరోసారి గుర్తింపు లభించింది. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.
కేరళ తర్వాత ఏపీయే టాప్
2022 ర్యాంకుల కోసం మొత్తం 25 రంగాల్లో (ఇందులో పరిశ్రమలకు సంబంధించి 15 రంగాలు, పౌరసేవలకు సంబంధించి 10 రంగాలు) మొత్తం 352 సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. ఈ సంస్కరణలు అమలు చేసినట్టు 17 రాష్ట్రాలు కేంద్రానికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా.. అందులో కేరళ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్ర, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర ఉన్నాయి. తెలంగాణ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని ర్యాండమ్‌గా సర్వే చేసి వారు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. 2022 సంవత్సరానికి సంబంధించి ఈవోడీబీ ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కూటమి పార్టీలకు చెంపపెట్టు
రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదంటూ ప్రచారం చేసిన కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలకు ఇది చెంపపెట్టు లాంటిందని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈవోడీబీ ర్యాంకుల్లో వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో నిలవడమే కాకుండా.. ఇప్పుడు సంస్కరణల అమలు విషయంలో రెండో స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనమంటున్నారు.
సులభతర వాణిజ్యం కోసం ‘ఏపీ వన్’ పేరిట సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని నడిపించారు. దీంతోనే డైకిన్, సెంచురీఫ్లై, ఏటీజీ, దివీస్, అరబిందో వంటి అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. గత ప్రభుత్వ విధానం వల్ల విద్యుత్ రంగంలో బ్రాండ్ ఏపీ విలువ మరమ్మతు చేయలేని విధంగా దెబ్బతిన్నదని టీడీపీ నిరంతరం ఆరోపించింది. ఇదే నిజమైతే.. అదానీ, గ్రీన్‌కో, అరేసెలార్ మిట్టల్ వంటి విస్తారమైన పేరున్న కంపెనీలు ఇంధన రంగంలో రూ.7,69,815 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టాయంటూ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment