Krishnapatnam Medicine: తొలి విడతగా 5 వేల మందికి మందు

Anandaiah Corona medicine distribution to 5,000 people in each district - Sakshi

మందు పేరు ‘ఔషధ చక్రం’ అని వెల్లడి

మందుపై విమర్శలు సరికాదన్న ఆనందయ్య

ముత్తుకూరు: ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య చెప్పారు. శ్రీ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు శ్రీగోవిందానంద సరస్వతి నేతృత్వంలో ఆనందయ్య శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందు ఉంచి పూజలు చేయించారు. ఆనందయ్య మాట్లాడుతూ..సోమవారం (ఈ నెల 7న) 3 రకాల మందు ఉన్న కిట్‌ను ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. 

మందు పేరు ‘ఔషధ చక్రం’  
తమ గురువుల సహకారంతో 30 ఏళ్లుగా అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నామని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు. మందుకు ఈ పేరునే పరిగణించాలని కోరారు. కాగా, కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు.

సోమిరెడ్డి విమర్శలు సరికాదు: ఆనందయ్య
నెల్లూరు(సెంట్రల్‌): కరోనాకు తాను తయారు చేసిన మందుపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ఆయుర్వేద మందు తయారీ నిపుణుడు ఆనందయ్య అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఏదో వెబ్‌సైట్‌ అంటూ విమర్శలు చేస్తున్నారని, సోమిరెడ్డి తనను రాజకీయాల్లోకి లాగడం మాని, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని శనివారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. తనను కలవడానికి వచ్చిన కొందరిపై లాఠీ చార్జీ చేశారని సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు.

తాను కరోనాకు మందు తయారుచేయడం మొదలుపెట్టి 40 రోజులకు పైగా అయిందని, కొద్ది రోజులపాటు నిలిచిపోయినా.. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో మందు తయారీలో నిమగ్నమయ్యానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా తనకు సహకరించిందన్నారు. అనుమతులు రావడంతో మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేసి, తరువాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేద్దామనే నిబంధన పెట్టుకున్నామని, అంతేతప్ప వెబ్‌సైట్‌కు కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. సోమవారం నాటికి మందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top