అరవ వేట.. తీరం విలవిల! | Karaikal sonaboats fishing on the beach | Sakshi
Sakshi News home page

అరవ వేట.. తీరం విలవిల!

Jul 4 2026 5:37 AM | Updated on Jul 4 2026 5:37 AM

Karaikal sonaboats fishing on the beach

మాటలకే పరిమితమైన చంద్రబాబు ప్రకటనలు

సముద్రతీరంలో కరైకల్‌ సోనాబోట్లు చేపల వేట 

భారీగా మత్స్య సంపద దోపిడీ 

వలల ధ్వంసంతో లక్షలాది రూపాయలు నష్టపోతున్న మత్స్యకారులు 

వేటకు వెళ్లాలంటేనే భయపడుతున్న గంగపుత్రులు 

నామమాత్రపు పెట్రోలింగ్‌తో సరిపుచ్చుతున్న అధికారులు

‘‘ తీరం మనదే..వేటా మనదే.. రాజీలేదు.. ఎవరైనా వస్తే రానిచ్చే పరిస్థితి లేదు. మన తీరంపై మనకే హక్కులు.. పొరుగు రాష్ట్రానికి చెందిన బోటు కనబడితే కలెక్టర్‌కు మెసేజ్‌ వస్తుంది. అప్రమత్తం అవుతాం. ఎవరనీ రానివ్వం’’ అంటూ ఈ ఏడాది మే 19వ తేదీన వేట విరామ సాయం అందించే కార్యక్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇది.

‘‘తమిళనాడు సోనాబోట్ల ఆగడాలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. అక్రమ వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవు. స్పీడ్‌ బోట్ల ద్వారా సముద్రంలో టాస్క్ ఫోర్స్  గస్తీ కాస్తోంది.’’ అంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌  5వ తేదీన నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. 

వేట విరామం తర్వాత పాండిచ్చేరి కరైకల్‌ బోట్లు వస్తున్నాయి. మత్స్యకారులపై దాడులు చేస్తున్నాయి. విలువైన మత్స్య సంపద దోచుకుపోతున్నాయి. పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం కావడంతో జిల్లాలో కడలిపుత్రులకు భద్రత కరువైంది. మంగళవారం వీటి దాడిలో సుమారు రూ.6 లక్షలకు పైగా విలువైన వలలు దెబ్బతిన్నాయని, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మత్స్యకారులు వాపోతున్నారు.  

సింగరాయకొండ: వేట విరామం తర్వాత ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి కడలిలో గంగపుత్రులు వేట మొదలు పెట్టారు. వారం రోజులు వేట సవ్యంగానే సాగింది. ఆ తర్వాత తమిళనాడు బోట్ల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం తీరానికి 18 నాటికల్‌మైళ్ల దూరంలో సోనాబోట్లు వేటసాగించాలి. నిబంధనలు మీరి పావు కిలోమీటరు దూరంలోనే చేపల వేట సాగిస్తున్నాయి. ఇటీవల వేట నిషేధ కాలం ముగిసిన నాటి నుంచి ప్రతి రోజు సోనాబోట్లు తీరానికి సమీపంలో వేటాడుతూ లక్షలాది రూపాయల వలలను తెంచేస్తూ మత్స్యకారులకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయి. 

పాండిచ్చేరి కరైకల్‌ ప్రాంతానికి చెందిన సోనాబోట్లు యథావిధిగా హల్‌చల్‌ చేస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మెరైన్‌ పోలీసులు, మత్స్యశాఖ సంయుక్తంగా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతిరోజు మూడు పెట్రోలింగ్‌ బోట్లతో పహారా కాస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నా సోనా బోట్ల ఆగడాలు కొనసాగుతుండడం గమనార్హం. తాము ఈ ప్రాంతంలో వేటసాగిస్తున్నామని సమాచారం పంపితే చెన్నై, కడలూరు బోట్లు కొన్ని సందర్భాల్లో దూరంగా వెళ్లిపోతున్నాయని, పాండిచ్చేరి కరైకల్‌ మత్స్యకారులు మాత్రం దౌర్జన్యంగా వచ్చి మా వలలు తెంచుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తీరంలో గస్తీ ఉత్తమాటే.. 
ప్రకాశం జిల్లాలో సుమారు 70 కిలోమీటర్ల సముద్రతీరం విస్తరించి ఉంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, గుడ్లూరు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 39 మత్స్యకార గ్రామాలున్నాయి. మొత్తం 50 వేల జనాభా. చేపల వేటపై ఆధారపడి సుమారు 12 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు 2,303 బోట్లు ఉండగా వాటిలో సుమారు 1,661 మోటరైజ్డ్‌ బోట్లు, 642 నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లు ఉన్నాయి.

సముద్రంలో పక్క రాష్ట్రాల సోనాబోట్లను అడ్డుకునేందుకు జువ్వలదిన్నె హార్బర్‌ వద్ద ఒకటి, కృష్ణపట్నం పోర్టు వద్ద రెండు పెట్రోలింగ్‌ బోట్లను ఏర్పాటు చేసి వాటిని మెరైన్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నామని, ఇప్పటి వరకు 6 సోనాబోట్లను పట్టుకున్నామని మెరైన్‌ అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే వందలాది బోట్లు తీరానికి సమీపానికి వచ్చి వేట సాగిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి.

ప్రతిరోజు తెల్లవారు జామున 2 గంటలకు వెళ్లి ఉదయాన్నే తిరిగి వస్తామని అయితే కరైకల్‌ బోట్లు మూడు గంటల సమయంలో తీరానికి దగ్గరగా వచ్చి వేటాడుతుండడంతో లక్షలాది రూపాయల వలలు ధ్వంసవుతున్నాయని, దీంతో రాత్రిపూట వేటకు వెళ్లటం మానుకున్నామని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట విరామం ప్రారంభమైన తర్వాత వారం రోజులపాటు దూరంగా వేట సాగించిన తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు మళ్లీ విజృభించాయని మత్స్యకారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట కొత్తపట్నం తీరానికి, మంగళవారం ఉదయం పాలక తీరానికి వచ్చిన బోట్లు వలలను ధ్వంసం చేసి విలువైన మత్స్య సంపదన దోచుకుపోయాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

మత్స్య సంపద తుడిచిపెట్టుకు పోతోంది  
కరైకల్‌కు చెందిన సోనాబోట్లు తీరానికి దగ్గరగా చేపల వేట చేయటంతో మత్స్య సంపద తుడిచిపెట్టుకు పోతోంది. దీంతో ఇటీవల కాలంలో తీరంలో మత్స్యసంపద లభించటం లేదు. ఖర్చులకు కూడా రావటం లేదు. ఇలాగైతే ఎలా బతకాలి. – నాయుడు వెంకటేశ్వర్లు, మత్స్యకారుడు, ఊళ్లపాలెం

వలలు ధ్వంసమవుతున్నాయి  
ప్రతిరోజు రాత్రి 2 గంటలకు చేపల వేటకు వెళ్లి ఉదయాన్నే తీరానికి వస్తాం. కానీ ఇటీవల కాలంలో సోనాబోట్లు తీరానికి దగ్గరగా రావటంతో రూ.20 వేల విలువైన వల ధ్వంసమైంది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా దౌర్జన్యంగా వలలు తెంచుకుపోయాయి. దీంతో రాత్రి పూట చేపల వేటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. రాత్రి పూట వెళితేనే చేపలు దొరుకుతాయి.     – తంబు హరిబాబు, మత్స్యకారుడు, ఊళ్లపాలెం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement