అనుమతి వచ్చాకే మందు పంపిణీ

Anandaiah Comments On Ayurvedic Medicine distribution - Sakshi

ఈ మందుపై సీఎం జగన్‌ దృష్టి పెట్టడం సంతోషం 

ఇప్పటికే ఆయుష్‌ బృందం పరిశీలన.. సంతృప్తి  

ఐసీఎంఆర్‌ కూడా పరిశీలించి నివేదిక ఇస్తే పంపిణీకి సిద్ధం 

కరోనా నివారణకు మందు తయారు చేసిన ఆనందయ్య వెల్లడి

నెల్లూరు (సెంట్రల్‌): కరోనా నివారణకు వన మూలికలతో తాను తయారు చేసే మందును ప్రభుత్వ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య తెలిపారు. ప్రజల మద్దతు, ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాను తయారు చేసిన మందుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను తయారు చేసిన మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఇప్పటికే ఆయుష్‌ బృందం నిర్ధారించిందని చెప్పారు. ఐసీఎంఆర్‌ వాళ్లు కూడా వచ్చి మందును పరిశీలిస్తారని అధికారులు చెప్పారన్నారు. ఆ తర్వాత అనుమతులు వచ్చాకే మందును ఎలా పంపిణీ చేయాలనే విషయమై ప్రభుత్వ సూచన, సహకారం మేరకు ఎమ్మెల్యే కాకాణి, ఇతర పెద్దలందరితో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.  
అనుమానాలొద్దు.. 
ఆయుర్వేద మందుపై ఎటువంటి ఆరోపణలు తగవని, అనుమానాలు కూడా సరికాదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ మందుపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో వ్యాధి ప్రబలుతుందనే ఆలోచనతో లోకాయుక్త ప్రశంసించడం, తాత్కాలికంగా పంపిణీని నిలిపి వేశారన్నారు. ఆనందయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారని, నిర్బంధించారని కొందరు ప్రచారం చేస్తుండటం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా మందుకు సంబంధించిన మూలికల సేకరణలో ఆనందయ్య ఉన్నారని తెలిపారు.  

చదవండి:
ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు

ఆపత్కాలంలో టీటీడీ ఔదార్యం.. ఆపన్నులకు అభయ హస్తం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top