ఎన్నికల విధులు నిర్వర్తించలేం

Amravati Employees JAC And AP Govt Employees Federation Request to CS - Sakshi

వ్యాక్సిన్‌ ఇచ్చే వరకు వాయిదా వేయాలి

ప్రతి ఉద్యోగికి రెండు డోసులు ఇచ్చాకే ఎన్నికలు జరపాలి

సీఎస్‌కు అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య వినతి  

సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించలేమని అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి తెలిపాయి. వ్యాక్సిన్‌ ఇచ్చేవరకూ పంచాయతీ ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చాయి. జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు వైవీ రావు, కోశాధికారి, పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వి.మురళీకృష్ణనాయుడు, టీచర్ల సంఘాల జేఏసీ చైర్మన్‌ జి.వి.నారాయణరెడ్డి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, కార్యదర్శి బి.కిషోర్‌కుమార్‌ తదితరులు సీఎస్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు సీఎస్‌తో సమావేశమయ్యారు. 

ఉద్యోగులపై ఎందుకీ కాఠిన్యం?
అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల అభ్యంతరాలను తొమ్మిది పేజీల లేఖలో సీఎస్‌కు తెలిపామన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందేవరకు ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభ్యర్థనను, ఉద్యోగుల ఆందోళనను పెడచెవినపెట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో పూర్తయ్యేది కాదని, కనీసం నెలరోజులపాటు నిత్యం ఉద్యోగులతో, ఓటర్లతో మమేకం కావాల్సి ఉంటుందని తెలిపారు. 1.40 లక్షల పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలని, బ్యాలెట్‌ బాక్సులు, సరంజామా తీసుకోవాలని, ఈ క్రమంలో ఎక్కడైనా కరోనా బారినపడే ముప్పు ఉందని చెప్పారు. ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్‌ ఎందుకు ఇంత కఠినవైఖరితో ఉన్నారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత కార్యాలయ ఉన్నతాధికారులను సైతం వదలకుండా జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి వ్యక్తిని తొలగించారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ, ఎన్నికల నిర్వహణ రెండు ఒకేసారి చేపట్టడం ఉద్యోగులకు ఎలా సాధ్యమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

కరోనా భయంతో ఎన్నికల విధులంటేనే హడలిపోతున్నాం
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ప్రబలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. కరోనా భయంతో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖంగా ఉన్నవారిని ఎన్నికల విధులకు కేటాయించవద్దని, సుముఖంగా ఉన్న ఉద్యోగులను.. అదీ వారికి వ్యాక్సిన్లు వేసిన తరువాతే ఎన్నికల విధుల్లో నియమించాలని కోరారు. కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ చెందుతూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైతే కరోనా బారినపడే ప్రమాదం ఉందని కలవరపడుతున్నట్టు పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top