ప్రతిభకే 'పద్మ' పురస్కారాలు | Sakshi
Sakshi News home page

ప్రతిభకే 'పద్మ' పురస్కారాలు

Published Mon, Nov 15 2021 4:34 AM

Amit Shah Comments On Padma Awards - Sakshi

సాక్షి, నెల్లూరు: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారి ప్రతిభ, సేవల కొలమానంగానే కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. ఇటీవల సినీనటి కంగనాకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంపై పలు రాజకీయపార్టీల నేతలు చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. గతంలో కేంద్రం ఇచ్చే అత్యున్నత పురస్కారాలకు ఎంపిక రాజకీయ సిఫార్సుల మేరకు జరిగేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం జరిగిన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ 20వ వసంతోత్సవాల్లో ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖనే ఎన్నుకుని సేవలందించిన వెంకయ్యనాయుడిది గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు.  

ఆస్తిలో సగభాగం కూతురికి ఇవ్వాలి: ఉప రాష్ట్రపతి  
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కుటుంబ ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సగభాగం రావాలని, అప్పుడే సాధికారత ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ భారత సాధికారతే ధ్యేయంగా స్థాపించిన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రెండు దశాబ్దాల సేవాప్రస్థానాన్ని పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల నడవడిక విలువలతో ఉండాలని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి తులసి మొక్కలు నాటారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్‌చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement