ఏపీ వైపు విదేశీ వర్సిటీల చూపు | Sakshi
Sakshi News home page

ఏపీ వైపు విదేశీ వర్సిటీల చూపు

Published Fri, Nov 27 2020 10:00 PM

American And Australian Universities Interested Setting Up Campuses In AP - Sakshi

సాక్షి, అమరావతి: పలు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు రాష్ట్రం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో ముఖ్యంగా ఉన్నత విద్యా రంగంలో తెస్తున్న విప్లవాత్మక మార్పులు, విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ఆయా వర్సిటీలను ఆకట్టుకుంటోంది. దీంతో రాష్ట్రంలో తమ వర్సిటీల క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్టాత్మక జార్జియాటెక్‌ యూనివర్సిటీ, అలబామా స్టేట్‌ యూనివర్సిటీ, క్లెమ్సన్‌ యూనివర్సిటీ, అస్ట్రేలియాకు చెందిన మరో ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయి. ఆయా వర్సిటీల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఇవి ఒక కొలిక్కి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు రాష్ట్ర విద్యార్థులు విదేశీ విద్య సులభంగా పొందడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విదేశీ విద్యా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర విద్యార్థికి సులభంగా విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించడం, అక్కడి విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, అధ్యాపకులతో పాటు పరిశోధనల్లో బాగస్వాముల్ని చేయడానికి వారధిగా పనిచేసేలా విదేశీ విద్యా విభాగాన్ని  రూపొందించారు. విదేశీ విశ్వ విద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా మన రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు విదేశీ నిధులు తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు పరిశోధన, విద్యా బోధన తదితర రంగాల్లో విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని 36 ప్రతిష్టాత్మక వర్సిటీలు ఏపీతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో కాకినాడలోని జేఎన్‌టీయూ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరి మధ్య కుదిరిన ఎంవోయూతో పరిశోధన కార్యక్రమాల కోసం 44 వేల అమెరికా డాలర్ల (రూ.32.80 లక్షలు) నిధులు మంజూరు అయ్యాయి. 

అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యకు చర్యలు 
అలాగే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలున్న ఏరోస్పెస్‌, సౌర, ఇంధన, వ్యవసాయం, ఆతిథ్య రంగం, బయోకెమిస్ట్రీ విభాగాల్లో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయా రంగాల్లో రాష్ట్ర విద్యార్థులకు సహకారం అందించడానికి జార్జియాటెక్‌, క్లెమ్సన్‌ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆస్టిన్‌, ఎ అండ్‌ ఎం కాలేజ్‌ స్టేషన్‌, లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ, లామర్‌ , డ్యూక్‌ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా, ఎమ్రార్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కార్పస్‌క్రిస్టీ తదితర విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర విదేశీ ఉన్నత విద్యా విభాగం రాష్ట్రంలోని 1,000 మంది విద్యార్థులకు ఉచిత విదేశీ ఆన్‌లైన్‌ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు ఇవ్వనుంది.

Advertisement
Advertisement