
అమెరికా నుంచి శాస్త్రవేత్తలు నిష్క్రమిస్తున్నారు. పరిశోధనలకు నిధులను తగ్గించడంతోపాటు వర్క్ వీసాలపై నిబంధనలను కఠినతరం చేయడంతో విసుగు చెందిన పలువురు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు దేశం వీడే ఆలోచనలో ఉన్నారు. స్థిరమైన అవకాశాలున్న యూరప్, ఆస్ట్రేలియా, కెనడాలకు మకాం మార్చాలని వారు ఆలోచిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఫ్రాన్స్, స్వీడన్ ప్రయత్నిస్తున్నాయి. శాస్త్రవేత్తలను తమ దేశాలకు స్వాగతిస్తున్నాయి.
ప్రభుత్వ నిధుల కోతతో అనిశ్చితి..
ట్రంప్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఐహెచ్) వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలకు వేల కోట్ల రూపాయల నిధులను నిలిపేయాలని నిర్ణయించింది. అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 7,400 మంది విదేశీ స్కాలర్లకు ట్రంప్ ప్రభుత్వం నిధులను ఇప్పటికే నిలిపేసింది. దీంతో శాస్త్రవేత్తలకు అనిశ్చిత వాతావరణం నెలకొంది. వారు ఆర్థికంగా చితికిపోయారు. నిధుల నిలిపివేత కారణంగా కేన్సర్ వంటి వైద్య పరిశోధన సహా అంతరిక్ష పరిశోధన వంటి రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంపై 22 అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఇప్పటికే దావా వేశారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ)లో మలేరియా పరిశోధనలో ఉన్న అమెరికన్ అలెక్స్ కాంగ్ ఫెలోషిప్‌ను ఫిబ్రవరిలో ఆకస్మికంగా రద్దు చేశారు. అమెరికా ఇకపై సైన్స్ లేదా ప్రజారోగ్య పరిశోధనలు చేయడానికి ఉత్తమమైన ప్రదేశం కాదని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన యూరప్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. వీసా పొందడం కష్టమేననని ఆయన అన్నారు. అమెరికాలోని చాలా మంది పరిశోధకులది ఇదే పరిస్థితి. ‘పరిశోధనలంటే నాకు ఇష్టం. కానీ అమెరికాలో ఇప్పుడందుకు అనుకూల పరిస్థితి లేదు’ అని ప్రతిష్టాత్మక అమెరికన్ సంస్థలో కేన్సర్, జన్యుశాస్త్రంపై అధ్యయనం చేస్తున్న పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
తలుపులు తెరిచిన కెనడా, చైనా
కెనడా, చైనాలు కూడా పరిశోధకులకు తలుపులు తెరుస్తున్నాయి. అమెరికాకు చెందిన పరిశోధకులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా, కెనడా, చైనా మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఒక అడుగు ముందుకేసి ఆ్రస్టేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డేనియల్ కేవ్... శాస్త్రవేత్తలను ఆకర్షించడానికి ఫాస్ట్ ట్రాక్ వీసాలను ప్రతిపాదించారు. అమెరికాతో టారిఫ్ వార్‌లో ఉన్న కెనడాకు ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థలకు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. పరిశోధకులకు పోటీ ప్యాకేజీలను అందించే సామర్థ్యం తక్కువే ఉన్నా.. అవకాశమివ్వాలని ఆలోచనలో ఉంది. చైనీస్–అమెరికన్ శాస్త్రవేత్తలను తిరిగి ఆహా్వనిస్తూ చైనా ఇప్పటికే ప్రకటన చేసింది. జాతీయ భద్రత ముసుగులో శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని అమెరికా అస్తవ్యస్తం చేస్తోందని చైనా విమర్శించింది. చాలా మంది చైనీస్–అమెరికన్ శాస్త్రవేత్తలు అమెరికాలో తమ కెరీర్‌ను ఇక్కడే కొనసాగించాలా వద్దా అనే పునరాలోచనలో పడ్డారని, చైనాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్నాళ్లకు మేథో వలస..
అమెరికాలో వలసలపై ఆంక్షలు విధించిన సమయంలో పరిశోధకుల నిష్క్ర మణ జరగడం గమనార్హం. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక దేశం నుంచి మేధోవలసలు ఈ స్థాయిలో జరగడం ఇదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అమెరికా తన శాస్త్రీయ, పారిశ్రామిక కార్యక్రమాలను పెంచడానికి కొత్త గుర్తింపు పత్రాలను అందించింది. జర్మన్, ఆ్రస్టియన్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు పునరావాసం కలి్పంచింది. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని స్థానిక అమెరికన్ సమాజం ఆవేదన వ్యక్తం చేసింది. శాస్త్రవేత్తల వలసలపై ఇంటర్నెట్‌లో పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద సమస్యలను అమెరికానే పరిష్కరించింది. అలాంటిది ఇప్పుడు శాస్త్రవేత్తలను పట్టించుకోవడం మానేసింది. డేటాను తుడిచిపెట్టేస్తోంది. పరిశోధనలను రద్దు చేసింది. తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటే కొన్ని పదాలను ఉపయోగించలేమని నిపుణులు చెబుతున్నారు. బెస్ట్ మైండ్స్ అమెరికా నుంచి వెళ్లిపోతున్నాయి’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో రాశాడు.
చైనాలో బిగ్ ఏఐ న్యూస్!
పదేళ్ల పాటు అమెరికాలో పనిచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం డాక్టర్ గువో–జున్ క్వి తిరిగి చైనాకు రావాలని నిర్ణయించుకున్నారు! అతను అమెరికాను వదిలి చైనాకు వెళ్లడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రీసెర్చ్ ట్రెండ్స్‌కు పెద్ద మేల్కొలుపు అని మరో పరిశోధకుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. అమెరికా వెలుపల పరిశోధకులు ఆప్షన్ల కోసం వెతుకుతున్నట్లు మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజంగా వలస అవుతుందా, అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే కొన్ని నెలల్లో తెలియనుంది.
స్వాగతించేందుకు యూరప్ సన్నాహాలు..
అమెరికాను వీడుతున్న శాస్త్రవేత్తలకు సహాయం చేయాలంటూ పలువురు అమెరికన్ చట్టసభల సభ్యులు, సభ్యదేశాలు, కంపెనీలు యురోపియన్ కమిషన్‌ను కోరినట్లు వార్తలొచ్చాయి. అమెరికాలోని వాతావరణం స్వతంత్ర పరిశోధకుల పరిశోధనలకు నిరుత్సాహం కలిగిస్తోందని యురోపియన్ పరిశోధనా మండలి అధ్యక్షురాలు మారియా లెప్టిన్ అన్నారు. పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందన్నారు. ఫ్రాన్స్, స్వీడన్, కెనడా వంటి దేశాలు అమెరికాను వీడాలనుకుంటున్న అగ్రశ్రేణి పరిశోధకులను తమ దేశాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇక్కడి బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలు, వృత్తి,వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యం, సాంస్కృతిక చైతన్యాన్ని చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పరిశోధకులకోసం నిధులను రెట్టింపు చేయాలని కమిషన్ అధ్యక్షుడు వాన్ డెర్ లేయన్ యురోపియన్ రీసెర్చ్ కౌన్సిల్‌కు పిలుపునిచ్చారు. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇప్పటికే బయో మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాలను కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్స్‌లర్ దెబోరా ప్రింటిస్ వెల్లడించారు. అమెరికా ప్రతిభావంతులకు ఫ్రెంచ్ విశ్వవిద్యాలయం ‘సైంటిఫిక్’ ఆశ్రయం కల్పిస్తోంది.