‘ఆ బాధ్యత జర్నలిస్టులదే.. మీడియా గుర్తుంచుకోవాలి’

Ambati Rambabu Speech On Role Of Media In Development Of Ap - Sakshi

సాక్షి, విజయవాడ: నిబద్ధతతో పనిచేసే విలేకరుల అవసరం నేడు ఎంతైనా ఉందని, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లటంతో విలేకరుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జర్నలిజం మౌలిక సూత్రాలు- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర అంశంపై అవగాహన సదస్సు ఆదివారం ఆర్టీసీ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్ష్యతన జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయటానికి పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. నేడు కమ్యూనికేషన్ రంగం వేగంగా విస్తరిస్తుందని, వాటి ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో భాగమైన  సోషల్ మీడియాలో కూడా వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు.

నిష్పక్షపాత జర్నలిజానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించటం వలన నిజాన్ని కొద్ది రోజులు మాత్రమే తొక్కి పెట్టగలమని గుర్తించాలన్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో ఈ ధోరణి పెరిగిపోయిందని, వాటిని సరిదిద్దుకోవటం వలన సమాజానికి మేలు జరుగుతుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అంతిమంగా ప్రజలకు వాస్తవాలు అందించే మీడియాకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు.

సైనికుడి చేతిలో ఆయుధం.. విలేకరి చేతిలో కలం ఒకటే: కొమ్మినేని
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, సైనికుడి చేతిలో ఆయుధం, విలేకరి చేతిలో కలం ఒకేటనన్నారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడించటానికి కలం కత్తి కంటే పదునుగా ఉపయోగించాలన్నారు. విలేకరులు సేవా దృక్పథంతో ఉండాలని, నిజాలను నిర్భయంగా వెల్లడించటానికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదన్నారు. నిజం నత్తనడకన నడిస్తే అబద్ధం మెరుపు వేగంతో నడుస్తుందని చమత్కరించారు. కాని జర్నలిస్టులు మాత్రం నిజానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, అర్థసత్యాలు, అసత్యాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని సూచించారు.

పత్రికలకు విశ్వసనీయతే ప్రాణం: మల్లాది విష్ణు
ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ పత్రికలకు విశ్వసనీయతే ప్రాణమన్నారు. ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఖండన మరో పత్రికలో రావటం అనే కొత్త సాంప్రదాయం ఇటీవల మొదలైందన్నారు. అది మంచి సంస్కృతి కాదన్నారు. అయితే బురద జల్లటానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పత్రికల దాడిని తిప్పి కొట్టడానికి మేము రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ట్స్ సమ్మిట్ పై కూడా అబద్ధాలు ప్రచారం చేశారని విచారం వ్యక్తం చేశారన్నారు.

జర్నలిస్టులు సమాజానికి ప్రయోజకారిగా ఉండాలి: మందపాటి శేషగిరిరావు
రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ  అవాస్తవాలను ప్రచారం చేస్తే నడిచే ప్లేగు వ్యాధి అని ఓ ఇంగ్లీషు కవి అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  జర్నలిస్టులు సమాజానికి ప్రయోజకారిగా ఉండే రచనలు చేసిన పుస్తకాలను గ్రంధాలయ సంస్థ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని ఒప్పంద పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు.

కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, ఎన్నార్టీఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్, జర్నలిస్ట్‌ ప్రతిక సంపాదకులు కృష్ణంరాజు, అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ కేవీ శాంత కుమారి, ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, పత్రికా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: పశ్చిమగోదావరి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top