కిడ్నీ మొత్తం ఆవ‌రించిన దుప్పికొమ్ము రాయి! | AINU Doctors Remove staghorn stone From Man Kidney | Sakshi
Sakshi News home page

కిడ్నీ మొత్తం ఆవ‌రించిన దుప్పికొమ్ము రాయి!

Sep 19 2024 6:15 PM | Updated on Sep 26 2024 2:11 AM

AINU Doctors Remove staghorn stone From Man Kidney

62 ఏళ్ల వ్య‌క్తికి తీవ్రంగా స‌మ‌స్య‌

రాయి ప‌గ‌ల‌గొట్ట‌కుండా మొత్తం తీసిన ఏఐఎన్‌యూ వైద్యులు

విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో అరుదైన చికిత్స‌

విశాఖ‌ప‌ట్నం, సాధార‌ణంగా కిడ్నీల‌లో రాళ్లంటే చిన్న‌చిన్నవి ఉంటాయి. కానీ, దాదాపు కిడ్నీ మొత్తం ఆవ‌రించి, బ‌య‌ట క‌టివ‌ల‌యంలోకి కూడా వ‌చ్చిన దుప్పికొమ్ము ఆకారంలోని రాయి ఉండ‌డం చాలా తీవ్ర‌మైన స‌మ‌స్య‌. దాదాపు 80 మి.మీ. కంటే పొడ‌వున్న ఈ రాయి ఇంచుమించు కిడ్నీ ఆకారంలోనే పెర‌గ‌డంతో మూత్ర‌నాళానికి అడ్డం ప‌డ‌దు, దాంతో నొప్పి తెలియ‌దు, వాపు కూడా అంత‌గా ఉండ‌దు. అందువ‌ల్ల రోగుల‌కు ఇది ఉంద‌నే విష‌య‌మే తెలియ‌దు. ఇలాంటి తీవ్ర‌మైన స‌మ‌స్య‌ను అత్యున్న‌త‌ సాంకేతిక నైపుణ్యంతో తొల‌గించారు విశాఖ‌ప‌ట్నంలోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యులు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ అమిత్ సాప్లే  తెలిపారు.

“62 ఏళ్ల వ్య‌క్తి నొప్పితో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఆయ‌న‌కు స్కాన్ చేస్తే.. కిడ్నీలో స్టాగ్ హార్న్ స్టోన్ (దుప్పి కొమ్ము త‌ర‌హా రాయి) ఉన్న‌ట్లు తేలింది. దాని వ‌ల్ల ఆయ‌న కిడ్నీ ప‌నితీరు కేవ‌లం 18% మాత్ర‌మే ఉంది. ఇది మామూలు రాళ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప‌రిమాణం పెద్ద‌ది ఉన్నా, మూత్ర‌పిండం ఆకారంలోనే పెర‌గ‌డం వ‌ల్ల ఇది మూత్ర‌నాళానికి అడ్డం ప‌డ‌దు. అందువ‌ల్ల వాపు, నొప్పి లాంటివి మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌వు. అలాగే మూత్రంలో ర‌క్త‌చారిక‌లు కూడా అంత‌గా క‌నిపించ‌వు.

కానీ దీనివ‌ల్ల స‌మ‌స్య ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ కేసులో ఇది కిడ్నీని దాటి క‌టివ‌ల‌యంలోకి కూడా వ‌చ్చింది. మామూలు రాళ్ల‌యితే సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో వాటిని లోప‌ల ప‌గ‌ల‌గొట్టి బ‌య‌ట‌కు తీస్తారు. కానీ, ఇది పెద్ద‌ది కావ‌డంతో కిడ్నీ వైపు నుంచి కాకుండా ముందు పొట్ట వైపు నుంచి తీసేందుకు పైలోలిథోట‌మీ అనే ప‌ద్ధ‌తిని అవ‌లంబించాం. ఇది కూడా లాప‌రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో పెద్ద కోత లేకుండా చేశాం. ఇంత‌కుముందు ఇదే చికిత్స‌ను ఓపెన్ స‌ర్జ‌రీ విధానంలో చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక నైపుణ్యాలు పెర‌గ‌డంతో దీన్ని లాప‌రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో చేయ‌గ‌లుగుతున్నాం. ఈ విధానంలోనే మొత్తం రాయిని ప‌గ‌ల‌గొట్ట‌కుండా, దాని కొమ్ముల‌తో స‌హా బ‌య‌ట‌కు తీసేశాము. ఒక స్టెంట్ వేసి, శ‌స్త్రచికిత్స ముగించాము. నెల రోజుల త‌ర్వాత ఆ స్టెంట్ తీసేస్తాము. శ‌స్త్రచికిత్స అనంత‌రం ఎలాంటి ఇబ్బందులు లేక‌పోవ‌డంతో పేషెంటును రెండోరోజే డిశ్చార్జి చేశాం” అని డాక్ట‌ర్ అమిత్ సాప్లే  వివ‌రించారు.

ఈ శ‌స్త్రచికిత్స‌లో విశాఖ ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రికి చెందిన యూరాల‌జిస్టులు డాక్ట‌ర్ ర‌వీంద్ర వ‌ర్మ‌, డాక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్‌, ఎనెస్థ‌టిస్టు డాక్ట‌ర్ శ్యాం కూడా కీల‌క‌పాత్ర పోషించారు. ఇలాంటి అత్యంత అరుదైన‌, స‌మ‌స్యాత్మ‌క‌మైన కేసుల‌కు చికిత్స చేయ‌డంలో అత్యున్న‌త సాంకేతిక నైపుణ్యాల‌ను వారు ప్ర‌ద‌ర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement