Andhra Pradesh: 16 వరకు మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాల రిజిస్ట్రేషన్లు

Admission Registration Date Extended Upto June 16 In AP Model Schools - Sakshi

నోటిఫికేషన్‌ జారీ డిమాండ్‌ నేపథ్యంలో సీట్ల సంఖ్యను పెంచిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 16 వరకు ఆన్‌లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల అనంతరం అభ్యర్థులు తగిన సమాచారంతో ఆన్‌లైన్లో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ అప్లికేషన్లను ఆమోదిస్తారు. దరఖాస్తుదారుల జాబితాలను జిల్లాల వారీగా ఈ నెల 22న ప్రకటిస్తారు. అనంతరం పాఠశాల వారీగా సీట్ల కేటాయింపునకు జూన్‌ 24 నుంచి 28వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు. స్కూళ్ల వారీగా ఎంపిక జాబితాను జూన్‌ 30న ప్రకటిస్తారు.

జూలై 1వ తేదీన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఇదిలా ఉండగా.. మోడల్‌ స్కూళ్లలో సీట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో సీట్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూళ్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం తరగతికి 80 సీట్లుండగా.. ఇప్పుడు వాటిని 100కు పెంచారు. ఇంటర్‌(బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ)కు సంబంధించి ప్రస్తుతం 20 చొప్పున సీట్లుండగా ఇప్పుడు 40 చొప్పున పెంచారు. రిజర్వేషన్లను అనుసరించి ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఈ పాఠశాలల్లో పూర్తిగా ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. ఇతర వివరాల కోసం  https://apms.apcfss.in ను సందర్శించాలి. ఇదే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top