‘జగనన్న అమ్మ ఒడి’ యథాతథం

Adimulapu Suresh Comments On Amma Vodi - Sakshi

రేపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’ పథకం రెండో విడత కార్యక్రమం ఈనెల 11న యథాతథంగా జరుగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారమే జీఓ–3ను విడుదల చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం అమలుచేస్తున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం, కోడ్‌ పేరిట ఈ పథకం అమలును నిలిపివేయాలని చూడడం దురదృష్టకరమన్నారు.
 
వరుస సెలవులతోనే 11కి వాయిదా 

ఈ ఏడాది కూడా రెండో విడతను 9వ తేదీనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ రెండో శనివారం, ఆదివారం సెలవుల వల్ల 11వ తేదీకి వాయిదా వేశామని మంత్రి చెప్పారు. నెల్లూరులో సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు నేరుగా జమ అవుతాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,76,589 మంది తల్లులు కొత్తగా లబ్ధిపొందనున్నారని మంత్రి సురేష్‌ చెప్పారు. పోయిన ఏడాది 42,24,302 మందికి ఇవ్వగా ఈ ఏడాది 44,00,891మందికి అమ్మఒడి అమలవుతోందన్నారు. అమ్మఒడి పథకం అమలు చేయనున్న తరుణంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వడం దారుణమని మంత్రి మండిపడ్డారు. పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని.. వాటిని ఆపాలని చూడడం అన్యాయమన్నారు. నెల్లూరు అర్బన్‌ ప్రాంతంలో ఈ పథకం కార్యక్రమం జరుగుతుంది కనుక కోడ్‌ పరిధిలోకి రాదన్నారు.  

టాయిలెట్ల నిర్వహణకు రూ.వెయ్యి 
ఇదిలా ఉంటే..  జగనన్న అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు తల్లులకు అందించనున్నారు. ఈ మొత్తంలో రూ.1,000ని టాయిలెట్ల నిర్వహణ నిధికి జమచేసి మిగిలిన రూ.14,000ను తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top