ఉద్యాన పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ | Sakshi
Sakshi News home page

ఉద్యాన పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

Published Wed, Aug 18 2021 3:14 AM

Acceptance of applications for admissions in Horticultural Polytechnic from today - Sakshi

తాడేపల్లిగూడెం: ఉద్యాన పాలిటెక్నిక్‌ కోర్సులో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఈ డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులు విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్లుగా చేరడానికి అవకాశాలు రావడంతో పాటు సొంతంగా ఉద్యాన నర్సరీలు ఏర్పాటు చేసుకోడానికి మార్గాలున్నాయి. ఉద్యాన డిప్లమో రెండేళ్ల కోర్సు పూర్తయిన తర్వాత హార్టీసెట్‌లో ర్యాంక్‌ వస్తే, బీఎస్‌సీ హార్టీకల్చర్‌ కోర్సులను అభ్యసించే అవకాశం ఉంటుంది.  

దరఖాస్తుకు అర్హతలు  
పదో తరగతి తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన రాష్ట్రంలోని విద్యార్థులు మాత్రమే ఈ కోర్సు చేయడానికి అర్హులు. పదో తరగతి కంపార్టుమెంట్‌లో ఉత్తీర్ణులైనవారు, ఇంటర్మీడియట్‌ ఫెయిలైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు, దాని కంటే పై చదువులు చదివిన వారు అర్హులు కారు. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 5 గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (హిందీతో కలిపి) సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ చాలెంజ్డ్‌ అభ్యర్థులు కనీసం 4 గ్రేడ్‌ పాయింట్‌ పొంది ఉండాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యాన పాలిటెక్నిక్‌లతో కలిపి మొత్తం 480 సీట్లు ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 200 సీట్లు, ప్రైవేట్‌ ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 280 సీట్లు ఉన్నాయని తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ తెలిపారు. ప్రవేశాలు, కోర్సు వివరాల విషయంలో సందేహాలుంటే డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఏఎస్‌ పద్మావతమ్మను 73826 33640 నంబర్‌లో సంప్రదించవచ్చు.   

Advertisement
Advertisement