నవరత్నాల ద్వారా రూ.1.30 లక్షల కోట్లు బదిలీ

Above One lakh crore transfer through Navaratnalu Scheme - Sakshi

మొత్తం 47.93 శాతం బీసీలు.. 16.30% ఎస్సీలు, 5.18% ఎస్టీలు లబ్ధిదారులు

వెనుకబడిన తరగతుల వారికి ఇప్పటివరకు రూ.86,144.01 కోట్లు బదిలీ

జగనన్న వసతి దీవెన ద్వారా రూ.2,304.97 కోట్లు చెల్లింపు

డ్వాక్రా మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా రూ.2,354.22 కోట్లు లబ్ధి

నాడు–నేడు కింద తొలిదశలో 353 గిరిజన సంక్షేమ పాఠశాలల ఆధునికీకరణ

అసెంబ్లీలో వివిధ ప్రశ్నలకు మంత్రుల సమాధానం

టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే కొనసాగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం

అధికార పార్టీ సభ్యులు పట్టించుకోకపోవడంతో వెనక్కితగ్గిన ప్రతిపక్షం

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభ జరగనివ్వకుండా గందరగోళం సృష్టించారు. స్పీకర్‌ మీదకు వారు రాకుండా డఫేదార్లు రక్షణ గోడగా నిలబడ్డారు. ఒకపక్క ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నా అధికార పార్టీ సభ్యులు ఎక్కడా స్పందించకుండా సభను కొనసాగించడంతో నినాదాలు నెమ్మదించాయి. ఇక నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు వంటి సభ్యులు నిలబడలేక మెట్లపై కూర్చుండిపోయారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తికాగానే టీ విరామం కోసం సభను 15 నిమిషాలపాటు స్పీకర్‌ వాయిదా వేశారు.  

ఈ స్థాయి సంక్షేమం ఎక్కడాలేదు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు నవరత్న పథకాల ద్వారా అర్హులైన పేదలకు రూ.1.30 లక్షల కోట్ల నగదును నేరుగా వారి ఖాతాల్లో జమచేసినట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు కరణం ధర్మశ్రీ, జోగి రమేష్, కాసు మహేష్‌రెడ్డి, అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్, మూలే సుధీర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

లబ్ధి పొందిన వారిలో అత్యధికంగా 47.93 శాతం బీసీ వర్గాలు ఉండగా.. ఎస్సీలకు 16.30 శాతం, ఎస్టీలకు 5.18 శాతం, మైనారిటీలకు 3.91 శాతం, కాపులకు 8.76 శాతం, ఇతరులకు 17.93 శాతం చొప్పున ప్రయోజనం కలిగినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా తమ ప్రభుత్వం వృద్ధులకు ప్రతీనెలా రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోందని.. దీన్ని క్రమేపీ రూ.3,000కు పెంచనున్నట్లు బుగ్గన తెలిపారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ చికిత్స అందించడంతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఒక్కో రోగికి రూ.7లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు చేసినట్లు బుగ్గన తెలిపారు.

కార్పొరేషన్ల ద్వారా కూడా ‘సంక్షేమం’
రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వాటి ద్వారా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఇప్పటివరకు వివిధ సంక్షేమ, ఇతర కార్యక్రమాలు ద్వారా రూ.86,144.01 కోట్లు అందించామని.. దీని ద్వారా 4,73,83,044 మంది ప్రయోజనం పొందినట్లు ఆయన తెలిపారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. వివిధ చేతివృత్తుల వారికి ఇప్పటివరకు రూ.2,272.31 కోట్లు ఇచ్చామని, దీని ద్వారా 11,73,018 మంది లబ్ధిపొందారన్నారు.

వైఎస్సార్‌ సున్నావడ్డీ ద్వారా..
ఇక వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం ద్వారా 98,00,626 మంది స్వయం సహాయక మహిళలు లబ్ధిపొందినట్లు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభకు వివరించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. దీని ద్వారా మొత్తం 9,41,088 స్వయం సహాయక సంఘాలకు రూ.2,354.22 కోట్లు అందజేసినట్లు తెలిపారు. 
► మరో ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ బదులిస్తూ.. జగనన్న వసతి దీవెన కింద 19,20,926 మంది విద్యార్థులకు రూ.2,304.97 కోట్లు అందజేశామన్నారు.
► అలాగే, నాడు–నేడు కింద తొలిదశలో 352 గిరిజన సంక్షేమ పాఠశాలలను రూ.137.13 కోట్లతో ఆధునీకరించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరో ప్రశ్నకు బదులిచ్చారు. 
► అలాగే, ఈ కార్యక్రమం ద్వారా మొత్తం రూ.16,000 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని.. రాష్ట్రంలోని 2,530 గిరిజన పాఠశాలలను మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top