జిల్లాలో ఇష్టారాజ్యంగా అబార్షన్లు

Abortions Increasing In Anantapur - Sakshi

ఆర్‌ఎంపీలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సుల కనుసన్నల్లో వ్యవహారం

గత నెల ‘సాయిరత్న’లో బాలికకు అబార్షన్‌

పోలీసుల చర్యలతో సరి

అనంతపురం సాయినగర్‌ మూడో క్రాస్‌లోని సాయిరత్న ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాధవి రూ.30 వేలకు కక్కుర్తి పడి గత నెల 12న ఆస్పత్రిలో పని చేసే ముగ్గురు సిబ్బందితో ఓ బాలికకు అబార్షన్‌ చేయించింది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ విస్మరించినా.. పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బాలికకు అబార్షన్‌ చేసినందుకు ఆస్పత్రి ఎండీ, నలుగురు స్టాఫ్‌ నర్సులు, స్వీపర్‌ను రిమాండ్‌కు పంపింది. స్పందించాల్సిన ఆరోగ్యశాఖ ఇంత వరకూ ‘సాయిరత్న’ వైపు తొంగి చూడలేదు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నా ఆరోగ్యశాఖ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. గతేడాది ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న శ్రేయ ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా ఓ అబార్షన్‌ జరిగితే.. ఆరోగ్యశాఖాధికారులు తూతూమత్రంగా తనిఖీలు చేసి వదిలేశారు. చివరకు బాధితులు ముందుకు రాలేదని ఆ విషయాన్ని మరుగున పడేశారు. కంటి తుడుపు చర్యగా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ స్విచ్‌బోర్డులను సీజ్‌ చేశారు.

సాక్షి, అనంతపురం హాస్పిటల్‌: సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కొందరు మాత్రం ఆ వృత్తికే మచ్చ తెస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చట్టాలను సైతం అతిక్రమిస్తున్నారు. ముఖ్యంగా అబార్షన్ల విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఎందరికో గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. ఎప్పటికప్పుడు కట్టడి చేయాల్సిన ఆరోగ్యశాఖ మాత్రం అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

అబార్షన్‌ ఏ పరిస్థితుల్లో చేయవచ్చంటే.. 
గర్భంలో శిశువు బుద్ధిమాంద్యం, తక్కువ బరువు, వివిధ రకాల రుగ్మతలతో ఉన్నప్పుడు, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అబార్షన్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
సుశిక్షితులైన స్త్రీవైద్య నిపుణులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. 
అబార్షన్లు చేయడానికి సదరు ఆస్పత్రికి మెడికల్‌     టర్మినేషన్‌ యాక్ట్‌ 1,971 లీగల్‌ రిజిస్ట్రేషన్‌ ఉండాలి. 
గర్భం దాల్చి 12 వారాలు అయిన తర్వాత ఒక గైనకాలజిస్టుతో పరీక్షలు చేయించుకుని తీవ్రమై ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తిస్తే సదరు వైద్యురాలి అనుమతి    (ఎంటీపీ అర్హత ఉండి)తో అబార్షన్‌ చేయవచ్చు. 
గర్భం దాల్చి 12 నుంచి 20 వారాలు అయినప్పుడు ఇద్దరు గైనకాలజిస్టుల అనుమతితో అబార్షన్‌ చేయాల్సి ఉంటుంది.

నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో అబార్షన్లు 
గర్భంలోని శిశువు, తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా వివిధ కారణాలతో కొందరు అబార్షన్లు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా కుటుంబీకులు, బంధువుల ఒత్తిడితో అబార్షన్లు చేయించుకుని గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. ఈ అబార్షన్ల తతంగంలో ప్రైవేట్‌ ఆస్పత్రులే కీలకంగా మారాయి. ఆయా ఆస్పత్రులకు గర్భిణులను తీసుకువచ్చే విషయంలో వివిధ క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో(ప్రైవేట్‌) పనిచేసే స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆర్‌ఎంపీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముందుగానే ఓ రేట్‌ మాట్లాడుకుని ప్రైవేటు ఆస్పత్రులకు కేస్‌లు పంపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు నేరుగా రెఫర్‌ చేయడం ద్వారా సదరు ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్సు, ఆర్‌ఎంపీకి కమీషన్‌ వస్తుండగా.. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ల తంతు ముగిసిపోతోంది. 

వెన్నుదన్నుగా ఓ అధికారి
ప్రైవేట్‌ అక్రమ అబార్షన్‌ దందాకు ఆరోగ్యశాఖలోని ఓ అధికారి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సాయిరత్న ఆస్పత్రిలో అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారి ఆదేశించినా.. సదరు అధికారి ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపడేశారు. అందువల్లే సదరు ఆస్పత్రిపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నిర్వాహకులు ఆస్పత్రిలో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల స్కాన్‌ సెంటర్ల సీజ్‌ వ్యవహారంలో సదరు అధికారి కీలకంగా వ్యవహరించి స్కాన్‌ సెంటర్ల నిర్వాహకులు బయటపడేలా సాయం చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఆరోగ్యశాఖ పాత్ర ఏంటి? 
ఎక్కడైనా అబార్షన్‌ జగడం, లింగ నిర్ధారణ, తల్లి, బిడ్డలో ఎవరు చనిపోయినా క్షణాల్లో ఆరోగ్యశాఖాధికారులు అక్కడికి చేరుకుని సంబంధిత ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలి. వాస్తవంగా సాయిరత్న ఆస్పత్రికి మెడికల్‌ టర్మినేషన్‌ ప్రెగ్నెన్సీ అనుమతి లేదు. గర్భవతులకు ఏదైనా అనారోగ్య సమస్యలున్నప్పుడు ఆరోగ్యశాఖ అనుమతితో అబార్షన్‌ చేస్తారు. ఇటువంటి నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఆరోగ్యశాఖకు ఉంది. ఆస్పత్రిని సీజ్‌ చేయడంతో పాటు సంబంధిత నిర్వాహకులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ వర్గాలంటున్నాయి. కానీ ఇక్కడ అలాంటి చర్యలేవీ తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top