మైనార్టీ తీరకుండానే మనువు | 9. 7 percent of AP youth get married before turning 21 | Sakshi
Sakshi News home page

మైనార్టీ తీరకుండానే మనువు

Jun 8 2026 4:58 AM | Updated on Jun 8 2026 4:58 AM

9. 7 percent of AP youth get married before turning 21

ఏపీలో 9.7 శాతం మంది బాలురకు 21 ఏళ్లు నిండకుండానే వివాహం

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6లో వెల్లడి

సాక్షి, అమరావతి: చట్టబద్ధమైన వయసు తీరకుండానే అబ్బాయిలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 15.9 శాతం మంది అబ్బాయిలు 21 ఏళ్లు నిండకుండానే ఓ ఇంటివారవుతున్నారు. ప్రతి వంద మంది అబ్బాయిల్లో 16 మంది మైనర్లుగానే పెళ్లి చేసుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)–6 నివేదిక వెల్లడించింది. 2023–24 సమయానికి చేసిన సర్వేలో దేశంలోని 15.9 శాతం మంది బాలురు మైనార్టీ తీరకుండానే వివాహం చేసుకున్నట్టు గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం, పట్టణ, నగరాల్లో 9.7 శాతం అబ్బాయిల మైనర్‌ వివాహాలు జరుగుతున్నట్టు తేల్చింది. 

ఈ తరహా వివాహాలు 2019–21లో 17.7 శాతం ఉండగా, 2023–24 నాటికి కొంత తగ్గుముఖం పట్టాయి. అబ్బాయిల మైనర్‌ వివాహాల్లో బిహార్‌ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలోని 25–29 ఏళ్ల పురుషుల్లో 29.6 శాతం మంది 21 ఏళ్లలోపు వివాహాలు చేసుకున్నారు. బిహార్‌లో అబ్బాయిల మైనర్‌ వివాహాలు ఏకంగా జాతీయ సగటుకు దాదాపు రెట్టింపు ఉన్నాయి. 

రాజస్థాన్‌లో 28.5 శాతం, మధ్యప్రదేశ్‌లో 25 శాతం, గుజరాత్‌లో 24.3 శాతం చొప్పున అబ్బాయిల్లో మైనర్‌ వివాహాలున్నట్టు వెల్లడైంది. రాజస్థాన్‌లో అమ్మాయిల్లో 24.6 శాతం మైనర్‌ వివాహాలు ఉన్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఆ రాష్ట్రంలో కంటే అబ్బాయిల్లో మైనర్‌ వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 9.7 శాతం, తెలంగాణలో 5.7 శాతం చొప్పున 2023–24లో 21 ఏళ్లలోపే వివాహాలు నమోదయ్యాయి.  

పల్లెలను మించి పట్టణాల్లో.. 
బాల్య వివాహాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయనే భావన ఉంది. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లో రివర్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోనూ అబ్బాయిలకు 21 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసేస్తున్నారు.  ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా బాలుర మైనర్‌ వివాహాలు 12.5 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య ఏకంగా 15.1 శాతం, గ్రామీణంలో 12.1 శాతం మాత్రమే కావడం గమనార్హం. నాగాలాండ్‌లో సైతం పట్టణాల్లో 13.8 శాతం, గ్రామాల్లో 8.2 శాతం మేర మైనర్‌ బాలుర వివాహాలు నమోదయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement