నల్లమలలో 73 పెద్ద పులులు

73 tigers in Nallamala Forest Andhra Pradesh - Sakshi

దేశంలో 60 శాతం పెరుగుదల ఇక్కడే

మార్కాపురం: దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్‌ రిజర్వు ఫారెస్టులో 73 పెద్దపులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2020లో 63 ఉండగా రెండేళ్లలో పెద్దపులుల సంఖ్య మరో పది పెరిగింది. ఇక్కడ 2018లో 47 పులులే ఉన్నాయి. పులుల గణన ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కొనసాగింది.

రాష్ట్రవ్యాప్తంగా వీటిసంఖ్య 75 ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అదనంగా చేరిన రెండు పులులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి పాపికొండల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగేళ్లలో పులుల పెరుగుదల 60 శాతం ఉండటం గొప్ప విషయమని అటవీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ ఫారెస్టు నుంచి కూడా పులుల సంచారం జరుగుతోంది. 

పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు 
నాలుగేళ్లలో పులుల సంఖ్య 47 నుంచి 73 వరకు పెరగటానికి నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు, వేటగాళ్లు రాకుండా 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గతంలో నాలుగు చెక్‌పోస్టులు మాత్రమే ఉండేవి. దీంతోపాటు ఎక్కడికక్కడ గడ్డిని పెంచటంతో పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీంతో పులుల సంఖ్య పెరిగిందని మార్కాపురం వైల్డ్‌ లైఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌ చెప్పారు.

అటవీ సమీప గ్రామాలు, కొన్ని చెంచుగూడేలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో 300 చిరుతలు, 300 ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దోర్నాల మండలంలోని బొమ్మలాపురం ప్రాంతంలో టీ64 పెద్దపులి పిల్లలతో కలిసి తిరుగుతోందని చెప్పారు. అటవీ ప్రాంతంలోకి వెళ్తే దాడులు చేసే ప్రమాదం ఉన్నందున ఆరునెలల పాటు ఎవరూ లోతట్టు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top