మహిళా ఖైదీలకు స్వేచ్ఛావాయువు

53 People Releasing From Jail With AP Govt Pardon - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షతో కారాగారం నుంచి 53 మంది విడుదల 

జైలు బయట స్వాగతం.. ఉద్వేగం 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటామన్న మహిళలు 

సాక్షి, అమరావతి: శుక్రవారం వారి జీవితాల్లో కొత్తవెలుగు తెచ్చింది. బంధించిన నాలుగు గోడల మధ్య నుంచి స్వేచ్ఛాప్రపంచంలోకి తీసుకొచ్చింది.  జీవితఖైదు అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్ష అమలుచేసింది. 53 మంది మహిళలకు కొత్త జీవితం ప్రసాదించింది. జైలునుంచి బయటకు వచ్చిన వారి ఆనందం వర్ణనాతీతం. స్వాగతం చెప్పేందుకు వచ్చిన ఆతీ్మయులను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తమకు స్వేచ్ఛా జీవితం ప్రసాదించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతతో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షతో ఖైదీలు విడుదలైన విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప జైళ్ల వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం.  

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్రంలోని మహిళా జీవితఖైదీలను విడుదల చేసేలా ప్రభుత్వం జీవో నంబరు 131 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు మేరకు 53 మందికి క్షమాభిక్ష పెట్టారు. వీరిలో కడప జైలు నుంచి ఒక మహిళాఖైదీ వారం రోజుల కిందట బెయిల్‌పై విడుదల కావడంతో శుక్రవారం 52 మందిని విడుదల చేసినట్టు జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్‌ ‘సాక్షి’కి తెలిపారు. కడప జైలునుంచి 26 మంది, నెల్లూరు జైలునుంచి ఐదుగురు, రాజమండ్రి జైలునుంచి 19 మంది,  విశాఖపట్నం సెంట్రల్‌ జైలు నుంచి ఇద్దరు మహిళా ఖైదీలు విడుదలయ్యారు. వీరిని ఆగస్టు 15నే విడుదల చేయాల్సి ఉండగా కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆలస్యంగా విడుదల చేశారు.  
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వస్తున్న మహిళా ఖైదీలు... చిత్రంలో నాలుగేళ్ల చిన్నారి  

వరకట్న వేధింపులకు పాల్పడిన వారే అధికం 
జీవితఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ విడుదలైన మహిళా ఖైదీల్లో ప్రధానంగా వరకట్న వేధింపుల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నవారే అధికంగా ఉన్నారు. వీరిలో అరవై ఏళ్ల వయసు పైబడిన వారూ ఉన్నారు. వీరంతా స్రత్పవర్తన కారణంగా ప్రభుత్వ క్షమాభిక్షతో విడుదలయ్యారు. జైలులో వివిధ రకాల శిక్షణ తీసుకున్న మహిళా ఖైదీల్లో పలువురు పీజీ చేయగా, ఇద్దరు డిగ్రీ పట్టాను అందుకున్నారు. 

మూడు నెలలకోసారి పోలీస్‌ స్టేషన్‌కు 
విడుదలైన 53 మంది మహిళా ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జైలు అధికారులు సూచించారు. మంచి ప్రవర్తనతో మెలుగుతామంటూ వారినుంచి రూ.50 వేల అంగీకార పూచీకత్తు (బాండ్‌)లు తీసుకున్నారు. వారికి విధించిన శిక్షాకాలం గడువు ముగిసే వరకు మూడు నెలలకోసారి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కి హాజరుకావాలి. మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడినా అరెస్ట్‌ చేసి, ముందుస్తు విడుదల రద్దుచేస్తామని ప్రభుత్వం షరతులు విధించింది. 

మహిళలు తమ కాళ్లపై నిలబడేలా శిక్షణ 
వాస్తవంగా జైలుకు వెళ్లొచ్చిన మహిళల పట్ల సమాజంలో కొంత చిన్నచూపు ఉంటుంది. కుటుంబాలకు ఆధారమైన ఆ మహిళలు తమ కాళ్లపై నిలబడేలా జైళ్లలోనే టైలరింగ్, అల్లికలు, తదితర చేతి వృత్తుల్లో  శిక్షణ ఇచ్చారు. క్షణికావేశంలో నేరం చేశామని, ప్రభుత్వ క్షమాభిక్షతో తమ వాళ్ల దగ్గరికి చేరుతున్నామని పలువురు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెట్టిన క్షమాభిక్ష తమ కుటుంబాల్లో ఎంతో ఆనందం నింపిందని సంతోషం వ్యక్తం చేశారు.  

కుట్టుమిషన్ల పంపిణీ 
రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీలకు త్రిదండి చినజీయర్‌ స్వామి ట్రస్ట్‌ ఔదార్యంతో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు, మహిళా జైలు సూపరింటెండెంట్‌ కె.కృష్ణవేణి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా వీటిని అందజేశారు. స్వచ్ఛంద సేవాసంస్థకు చెందిన ప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌రామ్‌ ఆరి్థక సహాయంతో జైలు నుంచి విడుదలైన 19 మందికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులతోపాటు, వారు ఇళ్లకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.500 చొప్పున నగదును అందించారు. కడపలో కూడా చినజీయర్‌ స్వామి ట్రస్ట్‌ కుట్టుమిషన్లు అందజేసింది.  

బాలింతగా జైలుకు.. నాలుగేళ్ల కుమార్తెతో సహా విడుదల 
రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్‌ జైల్‌ నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీల్లో ఒకరు నాలుగేళ్ల కుమార్తెతో సహా విడుదలైంది. ఆరోనెల గర్భిణిగా ఉండగా శిక్షపడటంతో ఆమె జైలుకు వచ్చింది. జైలులోనే పురుడు పోసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం నాలుగేళ్ల వయస్సున్న పసిపాప రాజమహేంద్రవరం అంగన్‌వాడీ స్కూల్‌లో చదువుతోంది. తల్లితోపాటు నాలుగేళ్లు జైలులోనే ఉండి శుక్రవారం స్వేచ్ఛాలోకంలోకి అడుగుపెట్టింది. 

 సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి వుంటాం 
మహిళల ప్రాధాన్యతను గుర్తించి శిక్షపడిన ఖైదీలను విడుదల చేయించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా జీవిస్తాం. జీవితకాలం వైఎస్‌ జగన్‌ పేరు చెప్పుకొంటాం. 
 – గ్రేసమ్మ, కడప జైలు నుంచి విడుదలైన కర్నూలు జిల్లా వాసి 

మహిళలను గుర్తించిన సీఎం  
కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే. మాకు విముక్తి కల్పించిన ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. మా కుటుంబాల సంక్షేమానికి పాటుపడిన ఆయన రుణం తీర్చుకోలేనిది.  
– నారాయణమ్మ, అనిమెల, విఎన్‌పల్లె, వైఎస్సార్‌ జిల్లా   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top