పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే

3 days Sankranti Festival 2021 Special Story - Sakshi

అచ్చమైన పండగలను ఆవిష్కరిద్దాం

ఆత్మీయతానుబంధాలను దూరం చేసే అలవాట్లను పక్కన పెడదాం

మూడు రోజుల పండగను ముచ్చటగా జరుపుకొందాం..

 స్మార్ట్‌ ఫోన్లు కాదు.. బంధాలను ‘స్మార్ట్‌’గా బలపరుద్దాం 

పండగ అంటే ఆధ్యాత్మిక.. సంప్రదాయాల వేదిక..  ఏడాదికోసారి వచ్చే తెలుగువారి పెద్ద పండగంటే.. ఆ ప్రత్యేకతే వేరు.. చుట్టాల పిలుపులు.. తోబుట్టువులతో మాటలు.. ఆత్మీయతాను బంధాలను ఓ చోటకు చేర్చి జరుపుకొనే ఆనందాల వేడుక.. రక్త సంబంధాల సరదా కలయిక.. అలాంటి పండగలు ప్రస్తుత యాంత్రిక జీవన వేగంలో అంతే మెరుపు వేగంతో సాదాసీదాగా వెళ్లనీయకుండా అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలతో.. నూరు శాతం పండగల్లానే జరుపుకొనేలా మనమంతా సంక్రాంతి మూడు రోజుల పండగలను మనసారా స్వాగతిద్దాం. తీయని జ్ఞాపకాలను ప్రతి మదిలో దాచుకుందాం..  

సాక్షి, అమలాపురం :  మా చిన్న తనంలో పండగలు ఎంతో గొప్పగా జరిగేవి.. పూర్వం పెద్దలు పండగలను సంప్రదాయబద్ధంగా జరిపేవారు...వంటి గత వైభవ మాటలను పక్కన పెట్టి ఆ సంప్రదాయాలను.. ఆ అనుభూతులను మన తరం కూడా ఆస్వాదించేలా.. అచ్చమైన.. స్వచ్ఛమైన. పండగలను ఆవిష్కరించుకుందాం. ఇందుకు మనం చేయాల్సిందల్లా యాంత్రిక జీవనంలో కొన్ని అలవాట్లను కాస్త పక్కన పెట్టి ఊరును, ఊళ్లో జరిగే పండగలను.. వాటి ప్రాధాన్యాన్ని ముందు తరాలకు తెలియజేద్దాం. ప్రతి ఇంట ప్రతిరోజూ పండగ అనేలా చేద్దాం.  

ఉమ్మడి భోజనమే ముద్దు 
సంక్రాంతి మూడు రోజులూ బయట స్నేహితులతో డిన్నర్లు, పార్టీలంటూ కుటుంబ ఆత్మీయత వాతావరణాన్ని దూరం చేసుకోవద్దు. మామూలు సమయాల్లో తరచూ పార్టీలు, డిన్నర్లు అంటూ సరదాగా గడిపేస్తాం. కనీసం ఆ పండగ మూడు రోజులైనా ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతింట్లో అయిన వాళ్ల మధ్య పూర్తి సమయం కేటాయిస్తే అదే పెద్ద పండగ. భోజనాలు, అల్పాహారాలు ఇంట్లోనే ఆత్మీయులందరూ ఒకే చోట కూర్చుని ఒకేసారి కలసిమెలిసి భుజిస్తే ఆ ఆనందం విలువ చాలా గొప్పగా ఉంటుంది.  

వ్యసనాలనూ పక్కన పెడదాం 
సంక్రాంతి పండగల కోసమని సుదూరాల నుంచి సొంతిళ్లకు చాలా మంది వస్తారు. అలాగే ఈ పండగల పేరుతో ఇళ్లన్నీ చుట్టాలతో నిండిపోతాయి. అయితే రోజూ చేసే తన వ్యసనాల పనిని పండగల నాడూ చేసి పండగ సంతోషాలకు దూరం కాకండి. మద్యం సేవించడం, పేకాట ఆడుతూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే.. మీరు పండగలను ఆస్వాదించలేరు. మామూలు రోజుల్లో ఎలాగూ తాగుతారు, తిరుగుతారు.. ఈ మూడు రోజులైనా తమ వాళ్లతో, నా అనుకున్న వాళ్లతో కబుర్లు, కాలక్షేపాలతో ఆనందంగా ఉంటే.. అదే పెద్ద పండగ.. 

పెద్దలను గౌరవిద్దాం..  
పండగలకు సొంతిళ్లకు వచ్చే వారంతా తమ మూలాలైన పెద్దలు జీవిత చరమాంకంలో వృద్ధాప్యంతో ఇంట్లో ఓ గదిలోనే గడిపే వారితో కొన్ని క్షణాలైనా గడపాలి. వారిని గౌరవిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి. వారిపై ప్రేమ చూపిస్తూ.. వారిపై అనురాగాన్ని కురిపించాలి. మనవళ్లు అయితే వారితో కొంతసేపు కూర్చొని నాటి సంక్రాంతి వైభవాలను వారి మాటలతో చెప్పించుకోవాలి. అందరూ గ్రూప్‌ ఫొటోలు దిగి పండగ జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలి. గతించిన మన ఇంటి పెద్దల పేరు చెప్పి ఎవరికైనా నూతన వస్త్రాలు కానుకగా ఇవ్వాలి. 

‘సెల్‌’ఫిష్‌గా వద్దు 
మనిషితో మనిషి ఆప్యాయంగా నేరుగా మాట్లాడుకునే రోజులు తగ్గాయి. పక్క రూమ్‌లో ఉన్నా సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేసుకునే రోజులొచ్చేశాయి. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుందని సంబరపడాలో.. లేక సంబంధబాంధవ్యాలను దూరం చేస్తుందని బాధ పడాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో ఎక్కడెక్కడో స్థిరపడి పండగలకు కార్లు, బైక్‌లపై సొంతూళ్లకు వారు ఈ సెల్‌ ఫోన్లు పట్టుకుని వాటితో గడిపేయకండి. పండగల మూడు రోజులూ వాటిని కాస్త పక్కన పెట్టి మీ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులతో సంతోషంగా పండగ చేస్కోండి.

 

జాగ్రత్తగా నడుపుదాం 
పండగలను సొంతూళ్లలో జరుపుకోవాలని హైదరాబాద్, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లో స్థిర పడ్ద వారు కార్లలో కుటుంబ సమేతంగా రెక్కలు కట్టుకుని మరీ బయలుదేరతారు. అలాంటి వారు అప్రమత్తతో  డ్రైవింగ్‌ను అప్రమత్తతతో చేయాలి. అందరూ ఒకేసారి సొంతూళ్లకు బయల్దేరడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో ఉంటాయి. ఆ ట్రాఫిక్‌లో నెమ్మదిగా డ్రైవ్‌ చేసుకుని రావాలి. అతివేగం వల్ల నీ సొంతింటికి ఓ గంట ముందే చేరుకోగలవు. అదే నెమ్మదిగా రావడం వల్ల ఓ గంట ఆలస్యంగా వస్తావు. ఏదైనా ప్రమాదం జరిగితే నీ పయనమే కాదు నీ వేగమూ ఎందుకూ...ఎవరికీ పనికి రాదు.

పండగను పండగలానే జరుపుకోవాలి 
పండగను పండగలానే జరుపుకోవాలి. ఏదో క్యాజువల్‌గా అన్నట్టుగా ఫ్యాషన్, టెక్నాలజీ పేరుతో పైపైనే జరుపుకోకూడదు. మనకు ఎన్ని పనుల ఒత్తిడి ఉన్నా.. ఎంతటి బిజీ లైఫైనా సంక్రాంతి పండగల మూడు రోజులూ సంప్రదాయ దుస్తుల దగ్గర నుంచి రుచులు, వినోదాలు, ఆచారాలు అన్నీ నిండైన పండగలో మనమంతా మమేకం కావాలి. ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతింటికి చేరుకుని ఉమ్మడి కుటుంబంలా పండగలను జరుపుకొంటాం. 
– పేటేటి శాంకరీ, మురమళ్ల, ఐ.పోలవరం మండలం  

బంధాలను బలపరిచేవే పండగలు 
నా దృష్టిలో అన్ని పండగల కంటే సంక్రాంతి పండగలు మనుషుల మధ్య బంధాలను బాగా బలపరుస్తాయి. ఉద్యోగాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఏ పండగలు ఎలా ఉన్నా సంక్రాంతి పండగలకు మాత్రం వచ్చి వాలిపోతారు. అందుకే సంక్రాంతి పండగలు ప్రతి ఊరే కాదు.. ప్రతి కుటుంబం ఓ సంబరాల సందడిగా మారిపోతాయి. పిల్లలు, పెద్దలు ఇలా అన్ని వయసుల వారిని మూడు పండగలు సంతోషపెడతాయి.  
– పేరి లక్ష్మీనరసింహం, విశ్రాంత బ్యాంక్‌ అధికారి, అమలాపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top