కరువు రైతును ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

కరువు రైతును ఆదుకోండి

Nov 3 2026 12:03 AM | Updated on Nov 3 2026 12:03 AM

అనంతపురం అగ్రికల్చర్‌/ ఆత్మకూరు/ కళ్యాణదుర్గం రూరల్‌: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, కరువు రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందేలా చూడాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం (ఐఎంసీటీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నతస్థాయి అధికారుల బృందం సోమవారం జిల్లాలో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి చిన్మయ్‌ గోట్మారా కేంద్ర బృందానికి టీం లీడర్‌గా వ్యవహరించగా... ఆయనతో పాటు ఆరుగురు అధికారులు బృందంలో ఉన్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు ముందు కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, పశుగ్రాసం సమస్య, తాగునీటి, పండ్లతోటల స్థితిగతులపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను వారు తిలకించారు. అనంతరం ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్ర బృందంతో పాటు వ్యవసాయశాఖ కమిషనర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ హాజరై రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల గురించి కేంద్ర బృందానికి విశదీకరించారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించి ఆదుకోండి

ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లాలోని 30 కరువు మండలాల్లో 1,96,681 మంది రైతులకు సంబంధించి 2,29,136 హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో రూ.999.77 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ నిబంధనల మేరకు జిల్లా రైతులకు రూ.280.41 కోట్ల సాయం అందించాలని కేంద్ర కరువు బృందాన్ని కోరారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలోని 29 కరువు మండలాల పరిధిలో 1,44,818 మంది రైతులకు చెందిన 1,28,972 హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో రూ.682.34 కోట్ల నష్టం జరిగిందన్నారు. నిబంధనల మేరకు రూ.173.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది సంఖ్యలో ఉన్న పశువులు, జీవాలకు గ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. వేసవి నాటికి తాగునీటికి సైతం ఇక్కట్లు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు. డ్వామా కింద విరివిగా ఉపాధి పనులు కొనసాగించడానికి చేయూత ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు సంబంధించి పశుశాఖకు రూ.24.93 కోట్లు, రూరల్‌ వాటర్‌ సప్లయ్‌కి రూ.15.57 కోట్లు, అర్బన్‌ వాటర్‌ సప్లయ్‌కి రూ.1.75 కోట్లు, డ్వామా పరిధిలో రూ.61.39 కోట్ల మేర కేంద్రం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆత్మకూరుతో పాటు మండలంలోని పంపనూరు, వై.కొత్తపల్లి, కళ్యాణదుర్గం మండలం ములకనూరు, కంబదూరు మండలాల పరిధిలో కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగించారు. దెబ్బతిన్న వేరుశనగ, కంది, ఆముదం, మొక్కజొన్న తదితర పంటల పరిశీలనతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గతంలో వరిగడ్డి వంద రూపాయలకు 30 కిలోలు వస్తుండేదని, ప్రస్తుతం రూ.300కి చేరిందని తెలిపారు. కొండల్లో గడ్డి లేదని, గొర్రెలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని చెప్పారు. 555 దాణా అందించాలని కోరారు. ముఖ్యంగా వీబీజీరామ్‌జీ ఐదు ఎకరాలకు కాకుండా గడ్డి పెంపకం కోసం 10 ఎకరాలకు పెంచాలని కోరారు. ఉచితంగా గడ్డి, మందులు, ఎరువులు, దాణా అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్ర కరువు బృందం సభ్యులు మహాలనోబిస్‌, జాతీయ పంట అంచనా కేంద్రం సహాయ సంచాలకులు ప్రభాకాంతి, గ్రామీణ శాఖ అండర్‌ సెక్రటరీ వినోద్‌ సమంత్‌, డిప్యూటీ డైరెక్టర్‌ పంకజ్‌ పహాడియా, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ మలోల, జేడీఏ సాలురెడ్డి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

రాష్ట్రానికి రూ.1,420 కోట్ల సాయం చేయండి

తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి రూ.1,420 కోట్ల సాయం అందించాలని కేంద్ర బృందానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో 388 మండలాలను కరువు జాబితాలో చేర్చి పంటనష్టం అంచనాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే పశుగ్రాసం, పండ్లతోటలు, తాగునీరు, ఉపాధి పనుల కోసం సాయం కోరుతున్నామన్నారు. మొత్తంగా రాష్ట్రానికి కరువు సాయం కింద రూ.1,420.26 కోట్లు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో వ్యవసాయానికి రూ.1,158.66 కోట్లు, ఉద్యానశాఖకు రూ.46.81 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.17.47 కోట్లు, పట్టణ నీటి సరఫరాకు రూ.28.46 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.168.84 కోట్లు ఇవ్వాలని కోరారు.

‘అనంత’కు రూ.280.41 కోట్లు, శ్రీసత్యసాయికి రూ.173.11 కోట్లు ఇవ్వండి

పశుగ్రాసం, తాగునీరు, ఉద్యాన, ఉపాధికి చేయూత అందించండి

అనంతపురం జిల్లా పర్యటనలో కేంద్ర కరువు బృందానికి కలెక్టర్‌ ఆనంద్‌ వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement