దగాపాటి రాజకీయం | - | Sakshi
Sakshi News home page

దగాపాటి రాజకీయం

Nov 3 2026 12:03 AM | Updated on Nov 3 2026 12:03 AM

● అధికార దుర్వినియోగం

● రీపోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

● టీడీపీ–బీజేపీ నేతల హల్‌చల్‌

అనంతపురం: నగరంలో అధికార దుర్వినియోగం తారస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ తన మందీమార్బలంతో పోలింగ్‌ స్టేషన్లలోకి చొరబడుతున్నా పోలీసులు అడ్డుకోలేని దుస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం అభ్యర్థి ఏజెంట్‌ తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళ్లకూడదు. అయినప్పటికీ, ఆదివారం జరిగిన సాధారణ పోలింగ్‌లోనూ, సోమవారం జరిగిన 30వ డివిజన్‌ 3వ బూత్‌ రీ పోలింగ్‌ సమయంలోనూ ఎమ్మెల్యే టీడీపీ కండువాతో కేంద్రంలోకి చొరబడ్డారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్‌ యాదవ్‌ తదితరులు కూడా ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి అభ్యంతరం

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడంపై వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఎమ్మెల్యే వెళ్తున్న సమయంలో అడ్డుకోని పోలీసులు.. రమేష్‌ గౌడ్‌, కార్పొరేటర్‌ అభ్యర్థి వెన్నం శివారెడ్డికి మాత్రం అడ్డు చెప్పారు. పోలీసులు రాజభక్తి ప్రదర్శిస్తున్నారని, టీడీపీ– బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులు మండిపడుతున్నారు.

నిన్న రిగ్గింగ్‌ చేసి... నేడు ఓటు వేసి..

అనంతపురంలోని 30వ డివిజన్‌ 3వ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌లో విచిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం సాధారణ పోలింగ్‌లో బూత్‌ను ఆక్రమించుకుని రిగ్గింగ్‌ చేసిన ఆదిశేషయ్య.. సోమవారం రీపోలింగ్‌లో మళ్లీ బూత్‌లోకి వచ్చి దర్జాగా ఓటు వేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆదివారం రిగ్గింగ్‌ జరిగిన వెంటనే ఆదిశేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వదిలిపెట్టేశారు. దీంతో రీ పోలింగ్‌కు సైతం అతను వచ్చి ఓటు వేశాడు. ఇదే సమయంలో మరోసారి రిగ్గింగ్‌ చేసి ఉంటే పరిస్థితి ఏంటని పలువురు చర్చించుకోవడం కన్పించింది.

తుది పోలింగ్‌ 53 శాతం

అనంతపురం: అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 30వ డివిజన్‌ 30/3 పోలింగ్‌ కేంద్రంలో సోమవారం రీ పోలింగ్‌ నిర్వహించారు. రీపోలింగ్‌ ముగిసే సమయానికి 53 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ కేంద్రంలో మొత్తం 980 ఓట్లకు గాను 518 ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement