● నేడే మున్సిపల్ ఓట్ల లెక్కింపు
● ఉదయం 8 నుంచే ప్రారంభం
● పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనంతపురం: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో మేయర్ అభ్యర్థులు, సంబంధిత కార్పొరేటర్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 62 డివిజన్లకు 62 టేబుళ్లతో పాటు మేయర్ స్థానానికి సంబంధించి 24 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కేటాయించిన టేబుళ్ల వద్దకు ఎలక్షన్ కౌంటింగ్ సిబ్బంది, అనుమతి పొందిన ఆయా అభ్యర్థుల ఏజెంట్లు చేరుకోవాలి. ఏజెంట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిశితంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. ఇక రాయదుర్గంలోని మోడల్ స్కూల్, కళ్యాణదుర్గంలో ఎస్‌వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుత్తిలో జెడ్పీ బాలికోన్నత పాఠశాల, గుంతకల్లులోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హైస్కూలు, తాడిపత్రిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
అనుమతి ఉన్న వారే కౌంటింగ్ కేంద్రంలోకి..
అనంతపురం సెంట్రల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ ద్వారం వద్ద నిరంతర నిఘాతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిషేధిత వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి అనుమతించరాదన్నారు. అలాగే విజయోత్సవాలకు అనుమతి లేదని రాజకీయపార్టీలకు సూచించారు. పోలీసు 30 యాక్టు, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


