భయంతో.. బడికి దూరం | - | Sakshi
Sakshi News home page

భయంతో.. బడికి దూరం

Nov 3 2026 12:03 AM | Updated on Nov 3 2026 12:03 AM

● రాప్తాడు జెడ్పీ పాఠశాలలో రంపం ఘటన ప్రభావం

● 386 మందికి 19 మందే హాజరు

రాప్తాడు రూరల్‌: పాఠశాల గంట మోగింది.. ఉపాధ్యాయులంతా విధులకు హాజరయ్యారు.. తరగతి గదుల తలుపులు తెరుచుకున్నాయి.. కానీ విద్యార్థుల సందడి కనిపించలేదు. మూడు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన రంపం దాడి ఘటన రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు సోమవారం నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా విద్యార్థులతో కళకళలాడాల్సిన పాఠశాల ప్రాంగణం విద్యార్థుల హాజరు లేక వెలవెలబోయింది. ఈ పాఠశాలలో మొత్తం 386 మంది చదువుతుండగా, సోమవారం 19 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ముఖ్యంగా పదో తరగతిలో రెండు సెక్షన్లకు కలిపి 70 మంది విద్యార్థులు ఉండగా, కేవలం ఇద్దరు మాత్రమే హాజరవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన విద్యార్థుల జ్ఞాపకాల నుంచి చెరిగిపోకపోవడంతో వారిలో భయాందోళనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చిన అన్ని తరగతుల విద్యార్థులందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టారు. విద్యార్థుల భయాందోళనలు తొలగించి, వారిలో తిరిగి ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బైండోవర్‌ పేరుతో

వేధింపులు

కూడేరు: ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులను బైండోవర్‌ పేరుతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలను మొక్కుబడిగా చూపుతూ.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులను అధిక సంఖ్యలో బైండోవర్‌ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఉదిరిపికొండలో ఐదుగురిని బైండోవర్‌ చేశారు. తాజాగా సోమవారం 12 మందిని బైండోవర్‌ చేస్తున్నామని, వెంటనే స్టేషన్‌కు రావాలని పోలీసులు సమాచారం అందించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తుండడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పు పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ రోజున వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చోకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ, అధికార టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పకడ్బందీగా

కౌంటింగ్‌ ఏర్పాట్లు

అనంతపురం అర్బన్‌: మునిసిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రక్రియ సజావుగా జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ కేంద్రాలను, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను జేసీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులు క్రమబద్ధంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ సిబ్బంది ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌రావు పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రిలోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ తనిఖీ చేశారు. కౌంటింగ్‌ ఏర్పాట్లను మునిసిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ వివరించారు. ఓట్ల లెక్కింపు సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన స్ట్రాంగ్‌ రూంను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement