ఉరవకొండ: ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగేందుకు ముఖం లేక.. స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేక అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఉరవకొండలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతూ నామినేషన్లు వేయకుండా, పోటీలో లేకుండా చేసి అక్రమ పద్ధతిలో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోసి.. రెడ్‌బుక్ రాజ్యాంగం మాటున పల్లెలు, పట్టణాల్లో హింసను ప్రోత్సహిస్తోందన్నారు. ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సొంతగ్రామం కౌకుంట్లలో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునే ధైర్యం లేక వైఎస్సార్‌సీపీ దళిత మహిళా అభ్యర్థులను బెదిరించి, కిడ్నాప్ చేయించి పోటీ నుంచి తప్పించడం ఎక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఉరవకొండలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ మైనార్టీ అభ్యర్థులు నామినేషన్‌ను విత్ డ్రా చేసుకునేలా వారి షాపులపై జీఎస్టీ అధికారులతో దాడులు చేయించడం.. 2, 9 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాకుండా అడ్డుపడ్డారన్న కారణంతో సతీష్ అనే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై కక్ష కట్టి దాడిచేసి గాయపరచడం.. ఇదేనా నీ దృష్టిలో ప్రజాస్వామ్యం అని కేశవ్‌ను నిలదీశారు. ఇతర ప్రాంతాల పోలీసుల భద్రత నడుమ సీసీ టీవీ పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కె.వి.రమణ, భీమిరెడ్డి, మోదుపల్లి రామాంజి నేయులు పాల్గొన్నారు.


