అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. గోరంట్ల మాధవ్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిలను శుక్రవారం రామగిరి మండలానికి వెళ్లకుండా అనంతపురం నగర శివారులోని గోరంట్ల మాధవ్ నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అక్కడికి వెళ్లేందుకు అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనను బయటకు వెళ్లనీయకుండా నిర్బంధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పును, చివరకు ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ అందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటూ, ప్రశ్నించే నాయకులను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వకుండా చేస్తుండడం అప్రజాస్వామికమన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీకి చెందిన గూండాలు, రౌడీలు, బ్లేడ్‌బ్యాచ్, తాగుబోతులతో పాటు కర్ణాటక నుంచి కిరాయి హంతకులను రప్పించారని ఆరోపించారు. రాళ్లు, రప్పలు, వేటకొడవళ్లతో భయోత్పాతం సృష్టించి ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. నామినేషన్ పత్రాలను చించివేయడంతోపాటు దాడులకు పాల్పడ్డారని, మహిళలనే కనికరం లేకుండా దాడులు చేయడం విచారకరమన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ప్రజలు తిరస్కరిస్తారనే ఆందోళనతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసుల సమక్షంలోనే నామినేషన్లను అడ్డుకుంటూ ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తుండడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రశ్నించే హక్కునూ కాలరాస్తున్నారు
నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకుంటున్న ఘటనలను ప్రశ్నించేందుకు కూడా ప్రతిపక్ష నాయకులకు హక్కు లేకుండా చేస్తున్నారని గోరంట్ల మాధవ్ వాపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉన్నాయని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత పరిణామాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. 2029 ఎన్నికల్లో చంద్రబాబునాయుడును రాజకీయంగా పాతాళానికి తొక్కి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భయోత్పాతం సృష్టించి నామినేషన్లు అడ్డుకునే కుట్ర
మహిళలపై దాడులకు పాల్పడడం విచారకరం
కూటమి తీరుపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజం
రామగిరికి వెళ్లనీయకుండా ఆయనతో పాటు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు


