గుంతకల్లు రూరల్: సినీ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రణబాలి సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ ఎం.విజయరాజు, అర్చక బృందం ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సినీ హీరోను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు.
మొరాయించిన ఆర్టీసీ బస్సు
● గంటన్నర పాటు పడిగాపులు కాసిన ఉద్యోగులు, ప్రయాణికులు
కూడేరు: ప్రభుత్వం కండీషన్ బస్సులు నడపకపోవడంతో అవి ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తుండడంతో సమయానికి అధికారులు విధులకు వెళ్లలేక, ప్రజలు గమ్యస్థానానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడేరు మండల శివారు ప్రాంతంలో అనంతపురం నుంచి బళ్లారికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మొరాయించింది. అందులో కూడేరు, ఉరవకొండ, విడపనకల్ మండలాల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఉన్నారు. దాదాపు గంటన్నర పాటు వారు బయట పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగులు, ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం మరొక బస్సు రావడంతో అందులో ఎక్కి వెళ్లారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు కండీషన్ ఉన్న బస్సులనే నడపాలని ప్రజలు కోరారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగించండి
ఆత్మకూరు: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగించాలని జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. నామినేషన్ల వేసేందుకు వచ్చిన అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ల ప్రక్రియపై ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ హేమంత్‌కుమార్, ఆర్‌డీఓ హేమంత్‌కుమార్, ఎస్‌ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.
నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులు హాజరవ్వాలి
● జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి
అనంతపురం న్యూ టౌన్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో అభ్యర్థులు తప్పక హాజరుకావాలని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ పి.విజయలక్ష్మి తెలిపారు. జిల్లా కలెక్టర్ తరఫున ఆమె మీడియాకు సమాచారాన్ని అందించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో జెడ్పీటీసీ స్థానాలకు, అలాగే అన్ని మండలాల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) శనివారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానుందని చెప్పారు. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌లో, ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల పరిషత్ కార్యాలయాలలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఆర్‌ఓలు, సహాయ రిటర్నింగ్ అధికారుల సమక్షంలో షెడ్యూల్ ప్రకారం జరగబోయే ఈ స్క్రూటినీ ప్రక్రియకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు తమ వెంట అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుని సకాలంలో హాజరుకావాలని సీఈఓ తెలియజేశారు.


