అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి పార్టీల నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్‌గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్, జిల్లా కార్యదర్శి పాళోయం నారాయణస్వామితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారపార్టీ నాయకులు ఎన్నడూ లేనంతగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దౌర్జన్యాలు, దాడులు తెగబడుతున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగితే ఓటమి తప్పదనే, అధికార పార్టీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలను ఏకంగా కేంద్రాల వద్ద అధికార పార్టీలకు చెందిన గూండాలు తిష్టవేసి, దాడులకు పాల్పడడం అప్రజాస్వామికమన్నారు. కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ, సీపీఐ అభ్యర్థుల రక్షణకు గన్‌మెన్‌లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రమేష్‌గౌడ్‌ను గెలిపించండి
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్‌గౌడ్‌ను సీపీఐ పార్టీ బలపరుస్తోందని, ఆయనతో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను జగదీష్ కోరారు. అర్బన్ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాల ఆరోపణలతో సైకిల్ గుర్తు లేకుండా కమలం గుర్తు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదని వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్‌గౌడ్ వాపోయారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో నగర పరిధిలో వేల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో విసిగిపోయామని ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారని తెలియజేశారు. ‘సేవ్ అనంతపురం’నినాదంతో నగర ప్రజలందరూ ఏకమవ్వడం సంతోషదాయకమన్నారు. 62 డివిజన్లలో జరుగుతున్న పోరు ఢిల్లీ గర్వానికి, అనంతపురం నగర ఆత్మగౌరవానికి మధ్యేనని స్పష్టం చేశారు.
టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఎన్నడూ లేనంతగా దౌర్జన్యాలు, దాడులు
వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం అభ్యర్థులను గెలిపించండి : సీపీఐ నేత జగదీష్


