ఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యాలు

Oct 17 2026 3:15 AM | Updated on Oct 17 2026 3:15 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అనంత తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో అధికార పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. పుంగనూరులో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన సమయంలో ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారని, రాయచోటిలోనూ వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి జరిగిందని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. మరోవైపు చురుగ్గా పనిచేసే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్‌ చర్యల పేరుతో పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర బలగాలతో ఎన్నికలు

నిర్వహించాలి

రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని అనంత డిమాండ్‌ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర పోలీసు బలగాలతో పటిష్టమైన భద్రత కల్పించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా, ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్‌సీపీ వెనక్కు తగ్గబోదని, దాడులు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

నామినేషన్ల చివరి రోజు

అప్రమత్తంగా ఉండాలి

గుత్తి: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు ఆదివారం అల్లర్లు జరిగే అవకాశముంటుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆనంద్‌ మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం గుత్తి మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో బ్యాలెట్‌ బాక్సులు, స్ట్రాంగ్‌ రూములు, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. మొదటి రెండు రోజులు నామినేషన్లు ప్రశాంతంగా జరుగుతాయన్నారు. అయితే చివరి రోజు గొడవలు జరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సురేంద్ర, తహసీల్దార్‌ పుష్పవతి, సీఐలు ధరణి కిషోర్‌, మహానంది, రాజు, ఎస్‌ఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

15 తూములకు నీరు కట్‌

● ఆయకట్టుకు బంద్‌ చేసి ఎంపీఆర్‌కు మళ్లింపు

బొమ్మనహాళ్‌: ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేయడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం జీబీసీ ఆయకట్టు, హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని 15 తూములకు సంబంధించిన షెట్టర్లు కిందకు దింపి నీటిని బంద్‌ చేసి, ఎంపీఆర్‌కు మళ్లించినట్లు ఎస్‌ఈ సుధాకర్‌రావు, డీఈ దివాకర్‌రెడ్డి తెలిపారు. ఐదు రోజుల అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. జీబీసీ, హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని 15 తూముల ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేసి ఎంపీఆర్‌ డ్యాంకు 650 క్యూసెక్కులు, పీఏబీఆర్‌కు 150 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఐదు రోజుల పాటు నీరు అందకపోతే పంటల పరిస్థితి ఏమిటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగుకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement