తాడిపత్రిటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఐ ఆరోహణరావు, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్ష వైఖరి అవలంబిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి హీరాపురం ఫయాజ్బాషాతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ఆగడాలను దీటుగా ఎదుర్కొంటామని అన్నందుకు తనపై బీఎన్ఎస్ 192, 351(2)233 సెక్షన్ల కింద సీఐ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. గత గురువారం రాత్రి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడు రఘు 31 వార్డు సాయిజ్యోతి ఇంటికి వెళ్లి ‘నామినేషన్ వేస్తే నీ భర్తను చంపుతాం’ అంటూ బెదిరించాడని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీకి ఫోన్లో తెలిపి.. ఆయన సూచనల మేరకు స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. ఇక వైఎస్సార్సీపీ నాయకులకు పారం–3, 4, 5 ఫారాలు లేకుండా మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ నామినేషన్ పత్రాలు అందజేశారని, జేసీకి తొత్తుగా మారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడారని ఫయాజ్బాషా విమర్శించారు. వీరిపై ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేతిరెడ్డిపెద్దారెడ్డి, హీరాపురం ఫయాజ్బాషా


