అనంతపురం ఎడ్యుకేషన్: ఎంపీ మిథున్‌రెడ్డిని తాలిబన్లు, ఎల్టీటీఈ తీవ్రవాదుల తరహాలో టీడీపీ గూండాలు చుట్టుముట్టి హత్యాయత్నానికి ఒడిగట్టారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు, రాయచోటిలో ఘటనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి గొడ్డలిపెట్ట అని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్మవరంలో బోయ ఈశ్వరయ్య, బయపరెడ్డిలను నామినేషన్లు వేయనీయకుండా దాడికి తెగబడడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలని గోరంట్ల మాధవ్ కోరారు.
బాధ్యులపై చర్యలు చేపట్టాలి
అనంతపురం: రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ పేర్కొన్నారు. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై, రాయచోటిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులతో ప్రతిపక్ష గొంతును నొక్కేలా చేయాలనుకోవడం దుర్మార్గమని తెలిపారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛకు, రాజ్యాంగ హక్కులకు సవాలు విసరడమేనని పేర్కొన్నారు. అరాచకాలతో రాజకీయంగా పైచేయి సాధించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదని తెలియజేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రావణకాష్టంలా రాష్ట్రం
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
గుంతకల్లుటౌన్: స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వై.వెంకటరామిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆయన గన్మెన్లపై హత్యాయత్నానికి పాల్పడడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. గుత్తిలో వైఎస్సార్సీపీ 22వ వార్డు అభ్యర్థి దస్తగిరి ఇంట్లోకి టీడీపీ మూకలు చొరబడి మారణాయుధాలతో బెదిరించి దాడికి తెగబడడం హేయమైన చర్య అని చెప్పారు.
ఎంపీపై దాడి హేయం
ఉరవకొండ: పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి పాల్పడడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రశాంతంగా జరగాల్సిన నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ గూండాలు పేట్రేగిపోయి దాడులకు తెగబడి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్నారు. ఘటనలపై ఎన్నికల సంఘం దృష్టి సారించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటమి భయంతోనే టీడీపీ విధ్వంసాలకు పాల్పడుతోందని, ఎంపీపై దాడి జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం సిగ్గుచేటన్నారు. వెంటనే దాడి తెగబడిన కూటమి రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతిపక్షాలను భయపెట్టాలనే కుట్ర
కళ్యాణదుర్గం: రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిపై పుంగనూరులో జరిగిన భౌతికదాడిని మాజీ ఎంపీ, పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఖండించారు. ఒక పార్లమెంట్ సభ్యుడిపైనే రాళ్లతో హత్యాయత్నానికి తెగబడటం రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతకు నిదర్శనమన్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ ప్రతిపక్షాలను భయపెట్టాలనే కుట్రతోనే టీడీపీ ఈ అరాచకాలకు ఒడిగట్టిందని విమర్శించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడబోదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఉరవకొండ: పుంగనూరు మున్సిపాల్టీలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు, నాయకులతో వెళ్తున్న రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రెలతో దాడులకు తెగబడడం అప్రజాస్వామికమని పార్టీ పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అలానే రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు శాంతి భద్రతల క్షీణతకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడకుండా టీడీపీ చేస్తున్న అరాచకాలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించి, ఎన్నికలు సజావుగా సాగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పుంగనూరు, రాయచోటి దాడి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


