ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న కారు | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న కారు

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

● తండ్రీకొడుకులకు గాయాలు

రాయదుర్గం రూరల్‌: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో తండ్రీ కొడుకులు గాయపడిన ఘటన మండలంలోని కొంతానపల్లి సమీపంలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బొమ్మనహాళ్‌ మండలానికి చెందిన తండ్రి, కొడుకులు నాగరాజు, రవితేజ ద్విచక్ర వాహనంలో స్వంత పని నిమిత్తం రాయదుర్గం వచ్చి, తిరిగి బొమ్మనహాళ్‌కు వెళ్తుండగా కొంతానపల్లి వద్ద కణేకల్లు వైపు నుంచి రాయదుర్గం వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగరాజుకు కాలు, కుమారుడు రవితేజకు చేయి విరిగింది. గమనించిన స్థానికులు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

బీ–ఫారం లేకుంటే..స్వతంత్ర అభ్యర్థే

రాయదుర్గంటౌన్‌: మున్సిపల్‌ పోరుకు షెడ్యూల్‌ విడుదల కావడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ పార్టీల తరఫున టికెట్‌ ఆశిస్తూ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తుండడంతో సందడి మొదలైంది. ఇదే సమయంలో కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లో రాజకీయ నాయకుల హడావుడి సైతం ప్రారంభమైంది. పోటీకి పార్టీ బీ–ఫారం చాలా కీలకం. దీన్ని దక్కించుకునేందుకు కార్పొరేట్‌, కౌన్సిలర్‌, చైర్మన్‌ ఆశావహులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల తరఫున ఎంత మందైనా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులకు పార్టీ బీ–ఫారం ఎవరికిస్తే వారే ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి ఇతర గుర్తులు కేటాయిస్తారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని క్రికెట్‌ కోచ్‌కు తీవ్ర గాయాలు

రాప్తాడు రూరల్‌: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో క్రికెట్‌ కోచ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. రాప్తాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం నగరం అశోక్‌నగర్‌ నాలుగో క్రాస్‌కు చెందిన ఆర్‌ఆర్‌ ప్రవీణ్‌కుమార్‌ (36) ఆర్డీటీలో క్రికెట్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 6 గంటలకు క్రికెట్‌ కోచింగ్‌ ఇచ్చేందుకు తన ద్విచక్ర వాహనం (ఏపీ 39 జేఎం 5520)పై స్టేడియానికి వెళ్తుండగా ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌ బైక్‌తో సహా రోడ్డుపై పడిపోవడంతో తలకు, రెండు వైపులా పక్కటెముకల వద్ద రక్తగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తండ్రి ఆర్‌.సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు మృతి

కణేకల్లు: మండలంలోని జక్కలవడికి గ్రామంలో శుక్రవారం సాయంకాలం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు బోయ నరసన్న (65) మృతి చెందాడు. గ్రామస్తుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయ నరసన్న యర్రగుంటలో పని ముగించుకొని బైక్‌లో స్వగ్రామానికి బయలుదేరాడు. గ్రామశివారులో ఆంజినేయస్వామి ఆలయం వద్ద బైక్‌ అదుపు తప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వైఎస్సార్‌సీపీ నాయకుడు నరసన్న మృతి పట్ల రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మార్చురీలో నరసన్న మృతదేహాన్ని మెట్టు సందర్శించారు. ఆయన కుమారుడు బోయ రమేష్‌తోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, కె. ఉషారాణి, పాటిల్‌ నాగిరెడ్డి, పాటిల్‌ బ్రహ్మానందరెడ్డి, మారెంపల్లి మారెన్న, హళ్లి నాగరాజు, దాసరి శ్రీనివాసులు తదితరులు నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఓటమి భయంతోనే దాడులు, దౌర్జన్యాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు గాజుల ఉమాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం లీగల్‌ సెల్‌ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పుంగనూరు, రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడంతోపాటు విధ్వంసానికి పాల్పడటాన్ని తప్పుబట్టారు. దాడులకు భయపడమని, ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి తీరుతారని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దాడులను నారా లోకేశ్‌ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement