● కూటమిలో మేయర్ సీటు బీజేపీకి
● టీడీపీ నష్టాలు.. జనసేన బలహీనతలు
● గెలుపు భారమంతా కమలం పార్టీపైనే
అనంతపురం క్రైం: నగరపాలక సంస్థ మేయర్ సీటు బీజేపీకి కేటాయించడం కూటమిలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. స్థానికంగా బలమైన పునాదులు లేని కమలం పార్టీకి అగ్నిపరీక్ష ఎదురైంది. టీడీపీపై ఉన్న వ్యతిరేకత, జనసేనలో కొరవడిన నాయకత్వం పరిస్థితుల నేపథ్యంలో అనంతపురంలో బీజేపీని ముందుకు తెచ్చిన వ్యూహం ఆసక్తికరంగా మారింది.
పాపం మూట.. కమలానికి భారం!
నగరంలో కబ్జాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్ల ఆరోపణలు అధికార కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వీటి ప్రభావం ‘స్థానిక’ ఎన్నికల్లో పడితే నష్టపోయేది ఒక్క పార్టీ మాత్రమే కాదు.. కూటమి మొత్తం. జిల్లా కేంద్రం అనంతపురంలో విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించే ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం కూటమికి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీకి ఎదురయ్యే రాజకీయ నష్టాన్ని తగ్గించడంతో పాటు జనసేన బలహీనతలను అధిగమించే వ్యూహంలో భాగంగా మేయర్ సీటును బీజేపీకి కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తేలాల్సింది బలాబలాలే!
నగరపాలక సంస్థ ఎన్నికల్లో డివిజన్ల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య సాగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. జనసేనకు 20, బీజేపీకి 10, టీడీపీకి 30 కార్పొరేటర్ స్థానాలు కేటాయించే ప్రతిపాదనపై నేతలు చర్చించినట్లు సమాచారం. కాగా సీట్ల సంఖ్యతోనే రాజకీయ బలం నిరూపితమవదు. అభ్యర్థుల ఎంపిక, స్థానికంగా ఉన్న పట్టు, కార్యకర్తల మధ్య సమన్వయం, ప్రజల్లో ఉన్న ఆదరణే ఫలితాలను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా బీజేపీకి కూటమిలోని ఇతర పార్టీల నుంచి ఎంతమేర సహకారం అందుతుంది.. అసంతృప్త నేతలను ఎలా సమన్వయం చేస్తారు. డివిజన్లలో ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుందన్న ప్రశ్నలు కీలకంగా మారాయి. మొత్తానికి మేయర్ పీఠం బీజేపీకి అవకాశమా.. లేక కూటమి రాజకీయ వైఫల్యాల భారమా అనేది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.
ఇద్దరూ..ఇద్దరే..
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన చుట్టూ ప్రస్తుతం కుటుంబ సభ్యులు మినహా అనుచర వర్గం, కీలక కార్యకర్తలు చాలా మంది దూరమయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం నుంచి కూడా చీవాట్లు తిన్నారు. మొత్తం క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తికి కారకులయ్యారన్న అపవాదును మూటగట్టుకున్నారు.
● జనసేన నేత, అహుడా చైర్మన్ టీసీ వరుణ్లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి దాకా ఉమ్మడి జిల్లాలో విస్తరించాల్సిన నాయకత్వం ప్రతి గురువారం నిర్వహించే ‘అహుడా గ్రీవెన్స్’కే పరిమితమైంది. చిన్న మరుగుదొడ్డి (పింక్ టాయిలెట్) కూడా నిర్మించలేకపోయారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడంలో కూడా విఫలమయ్యారు. ఈ క్రమంలో జనసేన రథాన్ని నడిపే సారథే లేడని కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.


