అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 71 మందికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు అందజేశారు. అనంతపురంలోని ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ గాంధీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛతతోపాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పాఠశాలలు, దేవాలయాలు, ఎన్జీఓలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, పంచాయతీ భవనాలను పరిశుభ్రంగా నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ 22 కేటగిరీల్లో 71 మందిని గుర్తించి అవార్డులు అందజేశామన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పరిశుభ్రత అనేది రోడ్లకే పరిమితం కాకుండా ఇళ్లు, వీధులు, గ్రామాలు, పరిసరాలతోపాటు ఆలోచనల్లోనూ ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ నాగరాజునాయుడు, డీఈఓ అయూబ్ హుస్సేన్, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి, ఐసీడీఎస్ పీడీ సాజిదాబేగం, డీఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.


