అనంతపురం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ‘ఖేలో ఇండియా సంవాద్– ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్’ కార్యక్రమాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఎం. శ్రీషాన్విని ఘనంగా సత్కరించారు. ఆమె కోచ్ ధనుంజయతో పాటు తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, పీఆర్‌ఓ డాక్టర్ బి. సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు శారద దేవి, ఉషారాణి, విజయ్ కుమార్, నరసింహులు, విమల తదితరులు పాల్గొన్నారు.
స్వీడన్ బ్లెకింగ్ వర్సిటీలో నలుగురికి అడ్మిషన్లు
అనంతపురం: స్వీడన్ దేశంలోని బ్లెకింగ్ వర్సిటీ, జేఎన్‌టీయూ(ఏ)లు సంయుక్తంగా అమలు చేస్తున్న ఇంటిగ్రేటేడ్ కోర్సుల్లో పలువురు విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు ఆధ్వర్యంలో గురువారం నలుగురు విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇంటిగ్రేటేడ్ కోర్సుల్లో భాగంగా బీటెక్ మూడు సంవత్సరాలు జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్‌లో, ఒక సంవత్సరం (మాస్టర్స్) ప్రోగ్రాంను స్వీడన్ బ్లెకింగ్‌లో చేయవచ్చని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి విద్యార్థులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారిన్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగ ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ట్రేడింగ్ పేరుతో మోసం
● నిందితుడి అరెస్టు
కడప అర్బన్: ట్రేడింగ్, వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో అధిక లాభాలు అందిస్తానంటూ నమ్మించి రూ.50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని కడప వన్‌టౌన్ సీఐ తిమ్మారెడ్డి, ఎస్‌ఐ అమర్నాథ్ రెడ్డి, పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలోనూ పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేష్టాది సుమన్ దీపక్‌రాజ్ (43) ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. తన పేరుతో హైదరాబాద్‌లో జేష్టాది సుమన్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవర్ ఫస్ట్ ఇంపీరియల్ గ్లోబల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలు ఉన్నాయని, తనకు అంతర్జాతీయ ట్రేడింగ్ లైసెన్స్ ఉందని పలువురిని నమ్మించాడు.విదేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారం చేస్తున్నానని, తన సంస్థల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని గొడుగు శివకుమార్ అనే వ్యక్తిని నిందితుడు నమ్మించాడు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అందిస్తానంటూ చెప్పడంతో శివకుమార్ రూ.50 లక్షలు పెట్టుబడిగా ఇచ్చాడు. అయితే.. హామీ మేరకు డబ్బులు, లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితుడు ఈ ఏడాది ఏప్రిల్ 11న కడప వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఆచూకీపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం సుమన్ దీపక్‌రాజ్‌ను అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.కాగా..నిందితుడు సుమన్ దీపక్‌రాజ్‌పై చిన్నచౌక్, కర్నూలు నాలుగో పట్టణం, అమీర్‌పేట, వెల్దుర్తి తదితర పోలీస్‌స్టేషన్లలో గతంలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


