● 30తో ముగియనున్న గడువు
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు, ఓటు తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఈనెల 30తో ముగియనుంది. ఆ రోజు వరకు అందిన దరఖాస్తులను, అభ్యంతరాలను సెప్టెంబరు 28వ తేదీలోపు పరిష్కరిస్తారు. అక్టోబరు 3న ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదుకు (ఫారం–6) 16,727 దరఖాస్తులు అందగా 2,299 పరిష్కరించారు. 14,428 పరిష్కరించాల్సి ఉంది. ఓటు తొలగింపునకు (ఫారం–7) 2,48,689 దరఖాస్తులు అందగా 2,48,480 పరిష్కరించారు. 209 పరిష్కరించాల్సి ఉంది. ఓటు వివరాల మార్పునకు 15,252 దరఖాస్తులు అందగా 3,299 పరిష్కరించారు. 11,953 పరిష్కరించాల్సి ఉంది.
ఓటరు నమోదులో వెనుకబాటు
18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలనేది ఎన్నికల కమిషన్ ప్రధాన లక్ష్యం. కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలు సందర్శించి 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే యువతకు ఓటు కల్పించే విషయంలోనూ కొత్తగా ఓటరు నమోదు క్రమంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం వెనుకబాటులో ఉంది. జిల్లాలో 18 ఏళ్లు దాటిన యువత 1.20 లక్షలు ఉన్నట్లు అంచనా. అయితే ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు ఓటరు నమోదుకు అందిన దరఖాస్తులు 16,727 ఉన్నాయి. దీన్ని బట్టి యువతను ఓటరుగా నమోదు చేయడంపై జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టలేదనేది స్పష్టమవుతోంది.
29, 30న ప్రత్యేక క్యాంపెయిన్..
ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్‌ఓలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఓటర్లు తమ ఓటు ఉందా.. లేదా అనేది పరిశీలించుకునేందుకు ఓటరు ముసాయిదా జాబితాను కేంద్రంలో ఉంచుతారు. జాబితాలో ఓటు లేకపోతే ఓటరు నమోదుకు ఫారం–6 దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా ఓటరు జాబితాలో ఓటరు వివరాల మార్పులు, చేర్పులకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సెప్టెంబరు 28వ తేదీలోపు పరిశీలించి అర్హులను ఓటరుగా నమోదు చేస్తారు.


