రేపు సాగునీటి సాధన పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

రేపు సాగునీటి సాధన పాదయాత్ర

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

కనగానపల్లి: రాయలసీమకు దక్కాల్సిన సాగు, తాగునీటి హక్కుల కోసం గురువారం పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తోపుదుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నీటి హక్కుల సాధన కోసం చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల సమీపంలోని హంద్రీ–నీవా కాలువపై 34వ కి.మీ రాయి వద్ద నుంచి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వకర్తలు, నాయకులు హాజరవుతారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

ఆయకట్టుకు నీరివ్వలేం

కణేకల్లు/ ఉరవకొండ: ఎల్‌–నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నందున ఈసారి తుంగభద్ర నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈసారి ఆయకట్టు పరిధిలోని భూములకు నీరివ్వలేమని స్పష్టం చేశారు. మంగళవారం కణేకల్లులోని చెరువు, ఉరవకొండ మండలం నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకులు, విడపనకల్లులోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కింద జరుగుతున్న పనులను అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు. టీబీ డ్యామ్‌లో నీటి పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాల కోసం ఆగస్టులో హెచ్చెల్సీ ద్వారా నీటిని తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో వరిసాగుకు నీరివ్వడం చాలా కష్టమని స్పష్టం చేశారు. రైతులెవ్వరూ వరిసాగు చేయ వద్దన్నారు. హెచ్చెల్సీలో జలచౌర్యం కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రత్యామ్నాయ సాగు పెంపుపై దృష్టి

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం కనీవినీ ఎరుగని విధంగా పతనం కావడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు పెంపు కోసం వ్యవసాయశాఖ తాజాగా ప్రణాళిక తయారు చేసింది. 40,435 క్వింటాళ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో అత్యధికంగా 21,226 క్వింటాళ్ల ఉలవలు, 8,353 క్వింటాళ్ల పెసలు, 8,001 క్వింటాళ్ల అలసందలు, 2,335 క్వింటాళ్ల జొన్నలు, 524 క్వింటాళ్ల కొర్రలు అవసరమని నివేదించారు. ఇంతకుమునుపు కందులు, ఆముదం, ఉలవ, పెసర, అలసంద, జొన్న, కొర్ర తదితర ఏడు రకాల విత్తనాలు 24,168 క్వింటాళ్లు అవసరమని నివేదించిన విషయం తెలిసిందే. అయితే వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుతున్నందున విస్తీర్ణం అంచనాలు తారుమారు కావడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకట్రెండు రోజుల్లోనే అనుమతులు రావచ్చని తెలుస్తోంది.

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement